క్రికెట్లో (Cricket) టాలెంట్‌తో పాటు లక్కు కూడా కలసి వస్తుంది. దేశవాళీ (Domestic) క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నారని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తే అక్కడ పూర్తిగా విఫలం అవ్వొచ్చు. ఒక్కోసారి దేశవాళీలో రాణించని క్రికెటర్లు (Cricketers) కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లలో అదరగొట్టవచ్చు. అలాంటి ఒక సంఘటనే మనం చెప్పుకుందాం. ఇంగ్లాండ్‌కు చెందిన జాన్ వార్ అనే క్రికెటర్ తన కెరీర్లో రెండే టెస్టులు ఆడాడు. స్వతహాగా బౌలర్ అయిన జాన్ వార్ (John Warr) ఈ రెండు టెస్టుల్లో చేసింది నాలుగు పరుగులు. ఇక బౌలింగ్‌లో అయినా సత్తా చాటాడా అంటే అక్కడా ఘోరంగా విఫలం (Failure) అయ్యాడు. 97 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన జాన్ వార్ 281 పరుగులు ఇచ్చాడు. 584 బంతుల పాటు బౌలింగ్ చేసి అతడు తీసింది కేవలం ఒకే ఒక వికెట్. దీంతో అతడి సగటు కాస్తా 281గా మారిపోయింది. ఆ రెండు టెస్టులు కూడా ఆస్ట్రేలియాపై ఆడాడు. తొలి టెస్టు 1951 జనవరి 5 నుంచి 9 వరకు సిడ్నీలో ఆడగా.. రెండో టెస్టు 1951 ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు అడిలైడ్‌లో ఆడాడు. ఇక ఆ తర్వాత జాన్ వార్ మరోసారి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించలేదు. ఇంత చెత్త రికార్డు ఉన్న జాన్ వార్ని తక్కువ అంచనా వేస్తే మనం పప్పులో కాలేసినట్లే.
జాన్ వార్ కౌంటీల్లో మిడిలెక్స్ తరపున కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కూడా పని చేశాడు. జాన్ వార్ 344 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో మొత్త 956 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో 65 పరుగులు ఇచ్చి 9 వికెట్లు పడగొట్టిన రికార్డు కూడా ఉన్నది. లిస్ట్ ఏ క్రికెట్లో 35 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన ఘనత కూడా ఉన్నది. ఒకే మ్యాచ్‌లో పది లేదా అంత కంటే ఎక్కువ వికెట్లు 5 సార్లు తీసిన రికార్డు కూడా జాన్ వార్ పేరిట ఉన్నది. ఇంగ్లాండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న జాన్ వార్.. ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరపున మాత్రం చెత్త రికార్డును కలిగి ఉన్నాడు.
అన్నట్లు ఈ రోజు (జులై 16) జాన్ వార్ పుట్టిన రోజు. 1927 జులై 16న జాన్ వార్ మిడిలెక్స్ కౌంటీలోని ఈలింగ్ అనే పట్టణంలో జన్మించాడు. ఫస్ట్ క్లాస్‌లో 3838 పరుగులు కూడా చేశాడు. వీటితో పాటు 118 క్యాచ్‌లు కూడా ఉన్నాయి. కాగా, జాన్ వార్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ది సండే టెలిగ్రాఫ్ పత్రికకు ఆర్టికల్స్ రాసేవాడు. అంతే కాకుండా డిస్కౌంట్ బ్రోకర్‌గా కూడా పని చేశాడు. 1977లో జాకీ క్లబ్లో సభ్యుడిగా మారాడు. 1989 నుంచి 1993 వరకు అదే క్లబ్ చైర్మన్‌గా పనిచేశాడు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌తో పాటు బెర్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. జాన్ వార్ 2016 మే 9న తన 88వ ఏట మరణించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bowler, Cricket, England, England vs Australia, ICC