టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) జావెలిన్ త్రోలో (Javelin Throw) స్వర్ణ పతకం (Gold Medal) సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) రాత్రికి రాత్రే పెద్ద స్టార్‌గా మారిపోయాడు. హరియాణా, పంజాబ్, మణిపూర్ ప్రభుత్వాలు అతడికి భారీ నజరానాలు ప్రకటించాయి. 100 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తొలిసారి అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలవడంతో నీరజ్ చోప్రాపై ప్రశంశల జల్లులు కురుస్తున్నాయి. ఇక ఈ స్వర్ణ పతక ప్రదర్శనతో అతడి వరల్డ్ ర్యాంకింగ్ (World Ranking) కూడా మెరుగయ్యింది. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లక ముందు 16వ స్థానంలో ఉన్న నీరజ్ చోప్రా.. ఇప్పుడు ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 2వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఒలింపిక్స్ ఫైనల్లో 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా మొత్తం 1315 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక జర్మన్ స్టార్ జావెలిన్ త్రోయర్ జోహానెస్ వెటర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 1396 పాయింట్లు ఉన్నాయి. జర్మనీకి చెందిన వెటర్ ఈ ఏడాది ఏడు సార్లు 90 మీటర్లకు పైగా దూరం విసిరాడు. కానీ ఒలింపిక్స్ ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. వెటర్ కేవలం 82.52 మీటర్లు మాత్రమే విసిరి 9వ స్థానంలో నిలిచాడు. అయినా సరే అతడి టాప్ ర్యాంక్ మాత్రం పదిలంగానే ఉన్నది.
అయితే నీరజ్ చోప్రా ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే వరల్డ్ నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదని నిపుణులు చెబుతున్నారు. ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. గతంలో 1.43 లక్షల ఇన్‌స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 34 లక్షలకు దాటిపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు.
జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకులు (PC: Screenshot/World Athlletics)
మరోవైపు నీరజ్ చోప్రా క్రేజ్‌తో పంచకుల స్పోర్ట్స్ స్కూల్‌కు అడ్మిషన్ల తాకిడి పెరిగింది. నీరజ్ అక్కడే జావెలిన్ త్రోలో శిక్షణ పొందాడు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.