WOMENS WORLD CUP 2022 IND W VS SA W LIVE SCORE UPDATES INDIAN WOMEN TEAM SETS FIGHTING TOTAL ON BOARD SRD
Women's World Cup - IND W vs SA W : మెరిసిన స్మృతి, మిథాలీ, షెఫాలీ.. సౌతాఫ్రికా ముందు ఫైటింగ్ టోటల్.. ఇక, బౌలర్లపైనే భారం..
IND W vs SA W (PC : BCCI)
Women's World Cup - IND W vs SA W : తప్పక గెలవాల్సిన మ్యాచులో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటారు. మిథాలీ, స్మృతి, షెఫాలీ వర్మలు హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
మహిళల వన్డే ప్రపంచకప్ (Women's World Cup 2022) టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు (Indian Womens Team) ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. స్మృతి మంధాన (84 బంతుల్లో 71 పరుగులు ; 6 ఫోర్లు, 1 సిక్సర్), మిథాలీ రాజ్ (84 బంతుల్లో 68 పరుగులు ; 8 ఫోర్లు), షెఫాలీ వర్మ ( 46 బంతుల్లో 53 పరుగులు ; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆఖర్లో హర్మన్ ప్రీత్ ( 57 బంతుల్లో 48 పరుగులు) రాణించింది. ఓ దశలో టీమిండియా 300 స్కోరు సాధించేలా కన్పించింది. అయితే, ఆఖరి పది ఓవర్లలో టీమిండియాకు జోరుకు సౌతాఫ్రికా బౌలర్లు బ్రేకులు వేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్, మసబతా క్లాస్ రెండు వికెట్లతో సత్తా చాటింది.టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు మెరుపు ఆరంభం అందింది. లేడి సెహ్వాగ్ షెఫాలీ వర్మ (Shafali Verma) తనదైన స్టైల్ లో మెరుపులు మెరిపించింది. ముఖ్యంగా షబ్నమ్ ఇస్మాయిల్ బౌలింగ్ ను టార్గెట్ చేసుకుని బౌండరీలు బాదింది. ఈ క్రమంలో 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.
మరో ఎండ్ లో స్మృతి కూడా చెత్త బంతుల్ని బౌండరీలు తరలించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి ధాటికి 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. మెరుపు ఆరంభం దక్కింది.. ఇక రెచ్చిపోవడమే తరువాయి అనుకున్న సమయంలో టీమిండియా జోరుకు బ్రేకులు పడ్డాయ్. 46 బంతుల్లో 53 పరుగులు చేసి మంచి టచ్ లో కన్పించిన షెఫాలీ వర్మ రనౌట్‌తో పెవిలియన్‌కు చేరింది. ఇందులో స్మృతి, షెఫాలీల ఇద్దరి తప్పు ఉంది. ఆ తర్వాత మంచి ఫామ్ లో ఉన్న యస్తికను దురదృష్టం వెంటాడింది. లెగ్ సైడ్ వైడ్ బంతిని వెంటాడిన యస్తిక కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ట్రయాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో 96 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
Youngest Indian to score 50 in WC - Mithali Raj
Oldest Indian to score 50 in WC - Mithali Raj
ఆ తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ను మిథాలీ, స్మృతి ముందుండి నడిపించారు. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో స్మృతి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే, హాఫ్ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడింది స్మృతి.ఈ క్రమంలో క్లాస్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి ట్రయాన్ కి క్యాచ్ ఇచ్చి ఔటైంది. దీంతో.. 80 పరుగుల విలువైన భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత మిథాలీ క్లాసిక్ షాట్లతో అలరించింది.
ఫస్ట్ లో నిదానంగా ఆడిన టీమండియా కెప్టెన్.. ఆ తర్వాత వేగం పెంచింది. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే, హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు ఆడే ప్రయత్నంలో క్లాస్ బౌలింగ్ లో ట్రయాన్ కి క్యాచ్ ఇచ్చి ఔటైంది మిథాలీ. దీంతో 234 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన పూజా కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఇస్మాయిల్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టింది. ఇక, ఆఖర్లో హర్మన్ ప్రీత్ మెరుపులతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.