Women's U-19 World cup 2023 : మహిళల అండర్ 19 ప్రపంచకప్ (Womens U 19 World Cup 2023)లో టీమిండియా (Team India) ఫైనల్ కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోరులో న్యూజిలాండ్ (New Zealand) మహిళల జట్టుపై భారత్ 8 వికెట్ల తేడాతో నెగ్గి ఫైనల్ కు చేరుకుంది. ఛేదనకు దిగిన భారత్ 14.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి నెగ్గింది. శ్వేత షెరావత్ (45 బంతుల్లో 61 నాటౌట్; 10 ఫోర్లు) మరోసారి అర్ధ సెంచరీతో రాణించింది. సౌమ్య తివారి (22) రాణించింది. అన్నా బ్రౌనింగ్ 2 వికెట్లతో రాణించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఏ దశలోనూ తడబడలేదు. షఫాలీ వర్మ (10)మరోసారి విఫలం అయ్యింది. అయితే మరో ఓపెనర్ శ్వేత చివరి వరకు ఉండి జట్టును ఫైనల్లో నిలబెట్టింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు చేసింది. జార్జియా ప్లిమర్ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు) రాణించింది. ఇసబెల్ల గేజ్ (22 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. వీరిద్దరూ మినహా మిగిలిన కివీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. బంతిని అందుకున్న షఫాలీ వర్మ 4 ఓవర్లు వేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది. పర్షవి చోప్రా 3 వికెట్లతో కివీస్ నడ్డి విరిచింది.
సమష్టిగా రాణించిన బౌలర్స్
టాస్ గెలిచిన భారత కెప్టెన్ షఫాలీ వర్మ కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టేలా భారత బౌలర్లు బౌలింగ్ చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో కివీస్ ను పరుగుల కోసం చెమటోడ్చేలా చేశారు. ఈ క్రమంలో భారత్ క్రమం తప్పకుండా వికెట్లను తీసింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడని కివీస్ ను కుప్పకూల్చింది.
భారత్ ఫైనల్ ప్రత్యర్థి ఎవరంటే?
కివీస్ పై నెగ్గిన భారత్ ఫైనల్ చేరింది. ఇక మరో టైటిల్ కంటెండర్ ఎవరో తేలాల్సి ఉంది. ఈరోజే (జనవరి 27) రెండో సెమీఫైనల్ పోరులో ఇంగ్లండ్ తో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్ విజేతతో జనవరి 29న (ఆదివారం) భారత్ ఫైనల్లో తలపడనుంది.
తుది జట్లు
న్యూజిలాండ్ అండర్ 19 మహిళల జట్టు
మెక్ లియోడ్, బ్రౌనింగ్, ప్లిమ్మర్, గేజ్, షార్ప్, ఇర్విన్,కె.ఇర్విన్, కొడైర్, కైన్, హాటన్, లాగెన్ బర్గ్
టీమిండియా అండర్ 19 మహిళల జట్టు
షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేత షెరావత్, సౌమ్య తివారి, త్రిష, రిచా ఘోష్, బసు, సదు, కశ్యప్, అర్చన దేవి, చోప్రా, సోనమ్ యాదవ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, India vs newzealand, South Africa, Team India, World cup