U-19 World Cup 2023 -IND W vs NZ W : దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ (Women's U-19 World Cup)లో టీమిండియా (Team India) మహిళల జట్టు సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. న్యూజిలాండ్ (New Zealand)తో జరుగుతున్న సెమీఫైనల్ పోరులో భారత బౌలర్లు సమష్టింగా రాణించారు. పర్షవి చోప్రా 3 వికెట్లతో కివీస్ నడ్డి విరిచింది. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు చేసింది. జార్జియా ప్లిమర్ (32 బంతుల్లో 35; 2 ఫోర్లు) రాణించింది. ఇసబెల్ల గేజ్ (22 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. వీరిద్దరూ మినహా మిగిలిన కివీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. బంతిని అందుకున్న షఫాలీ వర్మ 4 ఓవర్లు వేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది.
సమష్టిగా రాణించిన బౌలర్స్
టాస్ గెలిచిన భారత కెప్టెన్ షఫాలీ వర్మ కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టేలా భారత బౌలర్లు బౌలింగ్ చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో కివీస్ ను పరుగుల కోసం చెమటోడ్చేలా చేశారు. ఈ క్రమంలో భారత్ క్రమం తప్పకుండా వికెట్లను తీసింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడని కివీస్ ను కుప్పకూల్చింది.
సెమీస్ గండం
ఆటతో సంబంధం లేకుండా భారత్ ను గత కొన్నేళ్లుగా సెమీస్ గండం వణికిస్తోంది. గ్రూప్ లో అదరగొట్టే భారత్ నాకౌట్ దశలో మాత్రం చేతులెత్తేస్తుంది. ఇక క్రికెట్ లో నాకౌట్ మ్యాచ్.. అది కూడా కివీస్ ప్రత్యర్థి అంటే భారత అభిమానుల్లో ఒకింత ఆందోళన కలగడం ఖాయం. ప్రస్తుతం జరుగుతున్న హాకీ ప్రపంచకప్ లోనూ భారత్ కివీస్ చేతిలో ఓడి క్వార్టర్స్ కు అర్హత సాధించలేకపోయింది. అయితే మహిళల జట్టు కివీస్ గండం నుంచి గట్టెక్కుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం టీంను చూస్తే బౌలింగ్ అద్భుతంగా ఉంది. అయితే బ్యాటింగ్ కాస్త బలహీనంగా ఉంది. పవర్ హిట్టర్స్ ఉన్నా తొందరపడి వికెట్లను చేజార్చుకుంటున్నారు. ఈ జాబితాలో సీనియర్ టీం ప్లేయర్స్ షఫాలీ వర్మ, రిచా ఘోష్ లు ఉండటం గమనార్హం. కివీస్ లాంటి టీంను ఓడించాలంటే భారత్ అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది.
తుది జట్లు
న్యూజిలాండ్ అండర్ 19 మహిళల జట్టు
మెక్ లియోడ్, బ్రౌనింగ్, ప్లిమ్మర్, గేజ్, షార్ప్, ఇర్విన్,కె.ఇర్విన్, కొడైర్, కైన్, హాటన్, లాగెన్ బర్గ్
టీమిండియా అండర్ 19 మహిళల జట్టు
షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేత షెరావత్, సౌమ్య తివారి, త్రిష, రిచా ఘోష్, బసు, సదు, కశ్యప్, అర్చన దేవి, చోప్రా, సోనమ్ యాదవ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, India vs newzealand, South Africa, Team India, World cup