Women's T20 World Cup 2023 : దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా ఫిబ్రవరి 10న మహిళల టి20 ప్రపంచకప్ (Women's T20 World Cup 2023)కు తెర లేవనుంది. భారత్ (India)తో సహా మొత్తం 10 జట్లు తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. ఈ క్రమంలో సోమవారం నుంచి వార్మప్ మ్యాచ్ లు షురూ కానున్నాయి. ప్రతి జట్టు కూడా రెండు వార్మప్ మ్యాచ్ లను ఆడనుంది. ఈ క్రమంలో భారత్ తన తొలి వార్మప్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia)తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఇటీవలె భారత్ వేదికగా 5 మ్యాచ్ ల టి20 సిరీస్ జరగ్గా.. అందులో ఆసీస్ జట్టు గెలిచింది. 2020లో జరిగిన టి20 ప్రపంచకప్ లోనూ ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడ్డాయి. అంతేకాకుండా గతేడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో కూడా ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఆ రెండు పర్యాయాలు ఆసీస్ దే విజయం.
ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ అనంతరం ఫిబ్రవరి 8 వ తేదీన భారత్ తన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ను ఆడనుంది. బంగ్లాదేశ్ తో భారత్ తన రెండో ప్రాక్టీస్ ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్ లు కూడా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఆరంభం కానున్నాయి. ఇక గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్.. తన తొలి పోరును చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఫిబ్రవరి 12న (ఆదివారం) ఆడనుంది. ఈ టోర్నీకి కొన్ని వారాలు ముందుగానే హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమిండియా సౌతాఫ్రికాకు చేరుకుంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లతో కలపి ట్రై సిరీస్ ఆడింది. అందులో ఫైనల్ కు చేరుకున్న భారత్.. తుది మెట్టుపై ఆతిథ్య దేశం చేతిలో ఓడింది.
ప్రపంచకప్ లో భారత ప్రయాణం అంత సులభంగా సాగే అవకాశం లేదు. లీగ్ దశలో గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్.. పాకిస్తాన్, ఇంగ్లండ్, ఐర్లాండ్, వెస్టిండీస్ లతో మ్యాచ్ లను ఆడాల్సి ఉంది. ఇందులో ఇంగ్లండ్ మాత్రమే భారత్ కంటే బలంగా కనిపిస్తుంది. దాంతో సెమీస్ చేరడం భారత్ కు పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే సెమీస్ నుంచే అసలు పోటీ మొదలవ్వనుంది. నాకౌట్ ఫోబియాను అధిగమించాలంటే అన్ని విభాగాల్లోనూ ఎలాంటి పరిస్థితులోనైనా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్ భారత్ ను కలవర పెడుతుంది. ట్రై సిరీస్ లో స్మృతి మంధాన పెద్దగా రాణించలేదు. గత 10 మ్యాచ్ ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే అర్ధ సెంచరీలు చేసింది. ఆమెతో పాటు జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ లు కూడా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అండర్ 19 ప్రపంచకప్ కెప్టెన్ షఫాలీ వర్మ, రిచా ఘోష్ ల రూపంలో పవర్ హిట్టర్స్ ఉన్నా వీరిలో నిలకడ లేదు. భారత బౌలింగ్ ఫర్వాలేదు. అయితే రెండు వార్మప్ మ్యాచ్ ల్లోనూ తమ లోటు పాట్లను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
లైవ్ ఎక్కడ చూడాలి?
వార్మప్ మ్యాచ్ లతో పాటు టి20 ప్రపంచకప్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ భారత్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లు కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ వార్మప్ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి లైవ్ చూడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs AUS, India vs australia, Smriti Mandhana, South Africa, Team India, Womens World T20