IND W vs ENG W : ఇంగ్లండ్ (England) చేతిలో మరో టి20 ప్రపంచకప్ పరాభవాన్ని టీమిండియా (Team India) మూటగట్టుకుంది. మహిళల టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World Cup 2023)లో భాగంగా గ్రూప్ బిలో జరిగిన పోరులో 11 పరుగుల తేడాతో భారత్ పై ఇంగ్లండ్ విజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. స్మృతి మంధాన (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. రిచా ఘోష్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడింది. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్స్ విఫలం అయ్యారు. సారా గ్లెన్ 2 వికెట్లు తీసింది. ఈ విజయంతో టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఇంగ్లండ్ సెమీస్ కు అర్హత సాధించింది. భారత్ సెమీస్ కు చేరాలంటే ఈ నెల 20న ఐర్లాండ్ తో జరిగే పోరులో నెగ్గాల్సి ఉంది.
ఆఖరి ఓవర్లో హై డ్రామా
ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 31 పరుగులు కావాలి. తొలి బంతికి రిచా ఘోష్ ఫోర్ సాధించింది. రెండో బంతిని కేథరిన్ హై ఫుల్ టాస్ వేయగా.. రిచా ఘోష్ మరో ఫోర్ బాదింది. హైల్ ఫుల్ టాస్ నడుం కంటే ఎక్కువ ఎత్తులో ఉండటంతో అంపైర్ దానిని నోబాల్ గా ప్రకటించింది. దాంతో భారత్ విజయ లక్ష్యం 5 బంతులకు 22 పరుగులకు చేరుకుంది. ఆ తర్వాత భారత్ వరుసగా 1, 1, 6, 2, 0 పరుగులను చేసింది. ఫలితంగా భారత్ గెలుపుకు చేరువగా వచ్చి ఓడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది.అయితే భారత స్పిన్నర్లు పేలవ ప్రదర్శన చేయడంతో ఇంగ్లండ్ ఆరంభంలో తడబడినా ఆ తర్వాత నిలదొక్కుకుంది. నాట్ సీవర్ (42 బంతుల్లో 50; 5 ఫోర్లు), అమీ జోన్స్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. రేణుక సింగ్ 4 ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీయడం విశేషం.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ను రేణుక సింగ్ వణికించింది. ఆకాశం మబ్బులు పట్టి ఉండటం.. గత రెండు రోజులుగా అక్కడ వర్షం కురవడంతో పిచ్ స్వింగ్ కు అనుకూలించింది. దాంతో రేణుక నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్ల పని పట్టింది. రేణుక దెబ్బకు డానీ వ్యాట్ (1) గోల్డెన్ డక్ గా వెనుదిరిగింది. కాసేపటికే అలైస్ క్యాప్సీ (3), డంక్లీ (10)లు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ మూడు వికెట్లు కూడా రేణుక ఖాతాలోనే చేరాయి. దాంతో ఇంగ్లండ్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఇక్కడి నుంచి నాట్ సీవర్ జట్టును ఆదుకుంది. కెప్టెన్ హీథర్ నైట్ (28)తో కలిపి 4వ వికెట్ కు 51 పరుగులు జోడించింది. అనంతరం నైట్ అవుటవ్వగా.. క్రీజులోకి వచ్చిన అమీ జోన్స్ తో మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే అర్ధ సెంచరీ అనంతరం రివర్స్ స్వీప్ కు ప్రయత్నించి సీవర్ పెవిలియన్ కు చేరింది. చివర్లో అమీ జోన్స్ దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ 151 పరుగులకు చేరుకుంది. శిఖా పాండే, దీప్తి శర్మలకు చెరో వికెట్ తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: England, IND VS ENG, India vs england, Smriti Mandhana, South Africa, Womens T20 World Cup