AUS W vs SA W : అద్భుతం జరగలేదు. ఆనవాయితీ ఖాయం అయ్యింది. మహిళల క్రికెట్ ను ఏలుతున్న ఆస్ట్రేలియా మహిళల జట్టు (Australia Women's Team) మరోసారి జగజ్జేతగా నిలిచింది. మహిళల టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World cup 2023)లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య సౌతాఫ్రికా (South Africa) పై 19 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దాంతో 6వసారి టి20 ప్రపంచ చాంపియన్ గా అవతరించింది. అంతేకాకుండా టి20 ప్రపంచకప్ నెగ్గడం ఆసీస్ కు ఇది హ్యాట్రిక్. 157 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. లారా వొల్వార్డ్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసింది.
లారా పోరాడినా
157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. ఇంగ్లండ్ తో జరిగిన రెండో సెమీఫైనల్లో అద్భుతంగా ఆడిన బ్రిట్స్ (10) ఈ మ్యాచ్ లో విఫలం అయ్యింది. ఆరంభంలో అటు లారా, ఇటు బ్రిట్స్ చాలా నెమ్మదిగా ఆడారు. దాంతో సఫారీ జట్టు తొలి 5 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే చేసింది. బ్రిట్స్, క్యాప్ (11), కెప్టెన్ లూస్ (2) వెంట వెంటనే అవుటయ్యారు. అయితే ఈ దశలో లారా తన బ్యాట్ కు పని చెప్పింది. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన ఆమె ఒక్కసారిగా విరుచుకుపడింది. ఫోర్లు, సిక్సర్లతో సౌతాఫ్రికా శిబిరంలో ఆశలు రేకెత్తించింది. ట్రయాన్ (25)తో కలిసి సౌతాఫ్రికాను గెలుపు దిశగా నడిపించింది. ఈ క్రమంలో లారా అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. అయితే కీలక సమయంలో మేగాన్ షూట్ బౌలింగ్ లో ఎల్బీగా అవుటైంది. రివ్యూ కోరుకున్నా లాభం లేకుండా పోయింది. లారా అవుటైన తర్వాత సౌతాఫ్రికా గెలుపు ఆశలు ఆవిరయ్యాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల (Australia Women's Team) జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (53 బంతుల్లో 74 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి కీలక ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకుంది. భారత్ తో జరిగిన సెమీఫైనల్లో కూడా మూనీ అర్ధ సెంచరీతో కదం తొక్కింది. తాజాగా ఫైనల్లో కూడా అజేయ అర్థ సెంచరీతో ఆసీస్ ను ఆదుకుంది. యాష్ గార్డ్ నర్ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించింది. వీరిద్దరు మినహా మిగిలిన ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మరిజానె క్యాప్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.