Women's Asia Cup 2022 : క్రికెట్ లో అనిశ్చితికి మారుపేరు పాకిస్తాన్ (Pakistan). నిలకడలేని ఆటకు పాక్ కేరాఫ్ అడ్రస్. గొప్పగా ఆడటం.. అంతలోనే తుస్సుమనడం పాకిస్తాన్ పురుషుల జట్టుకు అలవాటే. తాజాగా ఇప్పుడు పురుషుల జట్టు లానే ఆ దేశ మహిళల క్రికెట్ జట్టు కూడా ప్రయాణిస్తోంది. బలహీన ప్రత్యర్థి చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ (Women's Asia Cup) 2022లో పాకిస్తాన్ జట్టు తన కంటే తక్కువ ర్యాంక్ జట్టు థాయ్ లాండ్ (Thailand) మహిళల టీం చేతిలో దారుణంగా ఓడిపోయింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్ లో థాయ్ లాండ్ పాకిస్తాన్ పై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో పాకిస్తాన్ ను ఓడించడం థాయ్ లాండ్ జట్టుకు ఇదే తొలిసారి.
టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్ సిద్రా అమీన్ (64 బంతుల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచింది. అమీన్ మినహా మిగిలిన ప్లేయర్లు విఫలం అయ్యారు. కెప్టెన్ బిస్మా మారుఫ్ (3)తో సహా అయేశా నసీం (8), సోహైల్ (1) ఇలా ఏ ఒక్క బ్యాటర్ కూడా దూకుడుగా ఆడలేకపోయారు. ఫలితంగా పాకిస్తాన్ 20 ఓవర్లల ో 5 వికెట్లకు 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. థాయ్ లాండ్ బౌలర్లలో టిపోచ్ 2 వికెట్లతో రాణించింది. పుటవాంగ్ ఒక వికెట్ తీసింది. మరో ఇద్దరు పాక్ ప్లేయర్లు రనౌట్ అయ్యారు.
ఛేదనలో థాయ్ లాండ్ ను ఓపెనర్ చంతం (51 బంతుల్లో 61; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ముందుకు నడిపింది. పరిస్థితులకు తగ్గట్లు ఇతర ప్లేయర్లతో కలిసి భాగస్వామ్యాలను నెలకొల్పింది. టార్గెట్ పెద్దగా లేకపోవడంతో అనవసరపు షాట్ల జోలికి వెళ్లలేదు. అలా అని మరీ నెమ్మదిగా కూడా ఆడలేదు. సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ థాయ్ లాండ్ ను విజయం వైపు నడిపింది. చంతం.. మరో ఓపెనర్ నానపట్ (13)తో కలిసి తొలి వికెట్ కు 40 పరుగులు.. కెప్టెన్ చైవై (17)తో కలిసి రెండో వికెట్ కు 42 పరుగులు జోడించింది. అయితే ఇక్కడి నుంచి పాకిస్తాన్ ప్లేయర్లు వరుసగా వికెట్లు తీశారు. ఇక జట్టు స్కోరు 105 పరుగుల వద్ద చంతం కూడా పెవిలియన్ కు చేరుకుంది.
Historic is created by Thailand women beat Pakistan by 4 wicket in Asia Cup 2022. This is their first win against Pakistan. Well played girl. Natthakan Chantham is a real star for them in this match. She scored 62(51) with 5 fours & 2 six. #PAKvsTHAI#WomensAsiaCup2022 pic.twitter.com/qKSpaoxEz7
— Asheesh Singh (@Asheesh00007) October 6, 2022
లాస్ట్ ఓవర్ థ్రిల్లర్
ఇక చివరి ఓవర్లో థాయ్ లాండ్ విజయానికి 10 పరుగులు అవసరం అయ్యాయి. బౌలింగ్ కు వచ్చిన డయానా వైడ్ తో ఆరంభించింది. ఆ తర్వాతి బంతికి బుచాతం సింగిల్ తీసింది. దాంతో థాయ్ లాండ్ విజయ సమీకరణం 5 బంతుల్లో 8 పరుగులకు మారిపోయింది. రెండో బంతిని ఎదుర్కొన్న కనోహ్ ఫోర్ బాదింది. ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు రాబట్టింది. ఇక మూడు బంతులకు 2 పరుగులు చేయాల్సిన తరుణంలో వరుసగా రెండు సింగిల్స్ తీసిన థాయ్ లాండ్ మరో బంతి మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరుకుంది. ఫలితంగా పాకిస్తాన్ పై థాయ్ లాండ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో టోర్నీలో బోణీ కొట్టిన థాయ్ లాండ్ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. భారత్ మూడు విజయాలతో టాప్ లో ఉంది. పాకిస్తాన్ 2 విజయాలు ఒక ఓటమితో 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్ లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. లీగ్ టేబుల్ లో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, India, Pakistan, Smriti Mandhana, Team India, Thailand, Women's Asia Cup