మహిళల ఆసియా కప్ టీ-20 క్రికెట్ టోర్నీ (Women's Asia Cup 2022)లో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు.. మరోసారి లీగ్ లో మ్యాచులో దుమ్మురేపింది. థాయిలాండ్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న అమ్మాయిలు ఆ జట్టుకు చుక్కలు చూపించారు. ఫస్ట్ బౌలింగ్ లో దుమ్మురేపిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్ లో సత్తా చాటింది. థాయిలాండ్ సెట్ చేసిన 38 పరుగుల టార్గెట్ ను కేవలం ఆరు ఓవర్లలో ఫినిష్ చేసింది. 38 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. సబ్బినేని మేఘన (18 బంతుల్లో 20 పరుగులు నాటౌట్, 3 ఫోర్లు), పూజా వస్త్రాకర్ (12 బంతుల్లో 12 పరుగులు నాటౌట్, 2 ఫోర్లు) రాణించారు.
షెఫాలీ వర్మ 6 బంతుల్లో 8 పరుగులు చేసిన నటాయా బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టింది. ఈ విజయంతో ఆసియా కప్ లీగ్ స్టేజీలో 10 పాయింట్లతో టాప్ ప్లేసులో నిలిచింది టీమిండియా. గురువారం సెమీస్ మ్యాచులో తలపడనుంది. రేపు జరిగే మ్యాచుల ద్వారా టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరో తేలనుంది.
ఇక అంతకుముందు స్పిన్ వలలో థాయిలాండ్ బ్యాటర్లను బిగించారు టీమిండియా బౌలర్లు. ఈ ఆసియా కప్ లో పాకిస్తాన్ ను ఓడించిన థాయిలాండ్ జట్టు ఈ మ్యాచులో మాత్రం టీమిండియా ముందు తేలిపోయింది. భారత స్పిన్నర్ల దెబ్బకి 37 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన థాయిలాండ్ 15.1 ఓవర్లలో 37 పరుగులు మాత్రమే చేసింది. నన్నపట్ కొంచరోయెంకై (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగింది. థాయ్ జట్టులో నలుగురు బ్యాటర్లు డకౌట్ గా వెనుదిరిగారు.
WOMEN'S ASIA CUP. India Women Won by 9 Wicket(s) https://t.co/1AVHjyOrSL #INDvTHAI #AsiaCup2022
— BCCI Women (@BCCIWomen) October 10, 2022
స్నేహ్ రాణా మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. మేఘనా సింగ్ ఓ వికెట్ దక్కించుకుంది. మూడు వికెట్లతో సత్తా చాటిన స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 లీగ్ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
టోర్నీ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న భారత బృందం.. దాయాది పాకిస్థాన్ చేతిలో ఓడినా.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో ఏడు దేశాల జట్లు తలపడుతున్నాయి. గాయంతో గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ రోజు కూడా రెస్ట్ తీసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న థాయ్‌లాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసేందుకు శక్తివంచన లేకుండా పోరాడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Smriti Mandhana, Team India, Women's Asia Cup, Women's Cricket