Women's Asia Cup 2022 - IND W vs UAE W : మహిళల ఆసియా కప్ (Asia Cup) 2022లో భారత (India) స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) మరోసారి మెరిసింది. శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో 76 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడిన జెమీమా.. తాజాగా యూఏఈ (UAE)తో జరుగుతున్న మ్యాచ్ లోనూ మరోసారి సూపర్ బ్యాటింగ్ తో టీమిండియాను ఆడుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 75 నాటౌట్; 11 ఫోర్లు), దీప్తి శర్మ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. యూఏఈ బౌలర్లలో చాయ మొగల్, మహిక గౌర్, ఇషా ఒజా, సురక్ష తలా ఒక వికెట్ సాధించారు.
20 పరుగులకే మూడు వికెట్లు
టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ ఓపెనర్ స్మృతి మంధాన స్థానంలో రిచా ఘోష్.. సబ్బినేని మేఘనతో కలిసి ఓపెనింగ్ కు వచ్చింది. అయితే రిచా ఘోష్ (0) ఎదర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యింది. ఆ తర్వాత ఫోర్ కొట్టి టచ్ లో కనిపించిన సబ్బినేని మేఘన (10) అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి పెవిలియన్ కు చేరింది. రివ్యూ నిబంధన ఈ టోర్నీలో లేదు. దాంతో ఆమె రివ్యూ తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇక దీప్తి శర్మతో సమన్వయ లోపం కారణంగా హేమలత (2) రనౌట్ అయ్యింది. దాంతో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
నిలబెట్టిన భాగస్వామ్యం
ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ మరోసారి తనదైన శైలిలో ఆడి జట్టును ఆదుకుంది. క్లీన్ హిట్టింగ్స్ తో బౌండరీలు రాబట్టింది. ఈ క్రమంలో దీప్తి శర్మతో కలిసి నాలుగో వికెట్ కు 128 పరుగులు జోడించింది. దీప్తి, జెమీమా ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నాక మరింత వేగంగా ఆడారు. భారీ షాట్ కు ప్రయత్నించిన దీప్తి శర్మ పెవిలియన్ కు చేరింది. ఇక చివర్లో జెమీమా దూకుండా ఆడటంతో భారత్ మంచి స్కోరును సాధించింది. రెగ్యులర్ ఓపెనర్ స్మృతి మంధానకు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడం విశేషం.
తుది జట్లు
టీమిండియా
స్మృతి మంధాన (కెప్టెన్), సబ్బినేని మేఘన, జెమీమా రోడ్రిగ్స్, హేమలత, రిచా ఘోష్, కిరణ్ నవ్ గిరె, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్
యూఏఈ
చాయా ముగల్ (కెప్టెన్), థీర్థ సతీశ్, ఇషా ఒజా, కవిశ, నటాషా చెరియత్, ప్రియాంజలి జైన్, ఖుషీ శర్మ, సమైరా దర్నిదార్క, మహిక గౌర్, వైష్ణవె మహేశ్, సురక్ష
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, India, Smriti Mandhana, Team India, UAE, Women's Asia Cup