హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs PAK W : ఆసియా కప్ లో భారత అమ్మాయిలకు షాక్.. పాక్ చేతిలో ఓడిన టీమిండియా..

IND W vs PAK W : ఆసియా కప్ లో భారత అమ్మాయిలకు షాక్.. పాక్ చేతిలో ఓడిన టీమిండియా..

PC : TWITTER

PC : TWITTER

IND W vs PAK W : మహిళల ఆసియా కప్ లో టీమిండియాకు షాక్ తగిలింది. పటిష్ట భారత అమ్మాయిల జట్టును పాకిస్థాన్ ఓడించింది. 13 పరుగుల తేడాతో టీమిండియాపై విజయ భేరి మోగించారు పాక్ అమ్మాయిలు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మహిళల ఆసియా కప్ లో టీమిండియాకు షాక్ తగిలింది. పటిష్ట భారత అమ్మాయిల జట్టును పాకిస్థాన్ ఓడించింది. 13 పరుగుల తేడాతో టీమిండియాపై విజయ భేరి మోగించారు పాక్ అమ్మాయిలు. 137 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హర్మన్ సేన 124 పరుగులకే ఆలౌట్ అయింది. రిచా ఘోష్ (13 బంతుల్లో 26 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు), హేమ లత (22 బంతుల్లో 20 పరుగులు) రాణించారు. స్మృతి మంధాన (17), జెమీమా రోడ్రిగ్స్ (2), హర్మన్ (12) పరుగులు చేసి నిరాశపర్చారు. నస్రా సంధు మూడు వికెట్లతో సత్తా చాటగా.. సదియా, నిదా దార్ చెరో రెండు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు.

  137 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు తెలుగమ్మాయి మేఘన దూకుడైన ఆరంభాన్ని ఇచ్చింది. అయితే, 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్ ఆడబోయి నస్రా సంధు బౌలింగ్ లో వెనుదిరిగింది. ఆ తర్వాత ఫామ్ లో ఉన్న జెమీమా కూడా భారీ షాట్ కు యత్నించి నిదా దార్ బౌలింగ్ లో ఔటై అయింది. ఆ వెంటనే స్మృతి మంధాన 17 పరుగులు చేసి ఔటవ్వడంతో 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

  ఇక, ఆ తర్వాత కూడా టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఓ దశలో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యేలా కన్పించిన టీమిండియా క్యాంపులో రిచా ఘోష్ ఆశలు చిగురించేలా చేసింది. ఆఖరి ఓవర్లలో భారీ షాట్లు ఆడింది. అయితే, భారీ షాట్ కు యత్నించి ఔటవ్వడంతో టీమిండియా ఆశలు గల్లంతయ్యాయి. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో టీమిండియా బ్యాటర్లు ఇబ్బంది పట్టారు.

  అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. సీనియర్ ప్లేయర్ నిదా దార్(37 బంతుల్లో 56 పరుగులు నాటౌట్), కెప్టెన్ మరూఫ్ (32 పరుగులు) తో పాక్ కు మంచి స్కోరు అందించారు. దీప్తి శర్మ మూడు వికెట్లతో సత్తా చాటగా.. పూజా రెండు వికెట్లు తీసింది.

  ఇక, ఆసియా కప్ లో టీమిండియాకు ఇదే తొలి ఓటమి. టీ20 ఫార్మాట్ లో పాకిస్థాన్ కు టీమిండియాపై ఇది మూడో విజయం మాత్రమే. 2012, 2016 ప్రపంచకప్ ల్లో మాత్రమే టీమిండియాపై నెగ్గింది పాకిస్తాన్ జట్టు. థాయిలాండ్ పై ఓడిన పాక్.. భారత జట్టుపై గెలుపుతో తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. ఈ మ్యాచులో ఓడినప్పటికీ భారత అమ్మాయిలు ఆరు పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నారు. పాక్ జట్టు ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. రేపు బంగ్లాదేశ్ అమ్మాయిలతో అమీతుమీ తేల్చుకోనున్నారు భారత అమ్మాయిలు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: India VS Pakistan, Smriti Mandhana, Team India, Women's Asia Cup

  ఉత్తమ కథలు