Women's Asia Cup 2022 -IND W vs SL W: మహిళల ఆసియా కప్ (Asia cup) 2022 టోర్నమెంట్ లో టీమిండియా (Team India) మహిళల జట్టు చాంపియన్ గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్ (India) 8 వికెట్ల తేడాతో శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుపై నెగ్గింది. తద్వారా ఆసియా కప్ ను ఏడోసారి గెలిచింది. ఇప్పటి వరకు ఆసియా కప్ 8 సార్లు జరగ్గా అందులో భారత్ ఏకంగా ఏడు సార్లు గెలవడం విశేషం. ఇక ఒకసారి మాత్రం బంగ్లాదేశ్ (2018లో) నెగ్గింది. అప్పుడు భారత్ రన్నరప్ గా నిలిచింది. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 4వ ఓవర్ నే వేసేందుకు రేణుక సింగ్ వచ్చింది.
ఇది కూడా చదవండి : టీమిండియాలో చోకర్స్.. వీరిని నమ్ముకుంటే కుక్క తోక పట్టి గోదారి ఈదినట్లే
ఆ ఓవర్ లో 3, 4, 5 బంతులకు వరుసగా మూడు వికెట్లు పడ్డాయి. అయితే దానిని అంపైర్లు హ్యాట్రిక్ గా పరిగణించలేదు. వరుస బంతుల్లో మూడు వికెట్లు పడితే హ్యాట్రిక్ అంటారు కదా అని అనుకుంటున్నారు కదూ.. అయితే ఇక్కడ ఒక రనౌట్ ఉంది. దాంతో మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు పడ్డా అది రేణుక ఖాతాలోకి హ్యాట్రిక్ గా చేరలేదు. టీం హ్యాట్రిక్ గా చేరింది. ఆ ఓవర్ 3వ బంతికి హర్షిత కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుటైంది. నాలుగో బంతికి అనుష్క రనౌట్ గా వెనుదిరిగింది. ఇక ఐదో బంతికి హాసిని క్యాచ్ అవుటైంది. దాంతో వరుస బంతుల్లో మూడు వికెట్లు పడ్డా హ్యాట్రిక్ మాత్రం రేణుక సింగ్ ఖాతాలోకి చేరలేదు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 65 పరుగులు చేసింది. శ్రీలంక తరఫున 10వ నంబర్ ప్లేయర్ ఇనోక రణవీర (22 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలవడం విశేషం. ఒషాది రణసింఘె (20 బంతుల్లో 13; 1 ఫోర్) ఇనోకతో పాటు రెండంకెల స్కోరును నమోదు చేసింది. అజేయమైన పదో వికెట్ కు జోడించిన 22 పరుగులే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. భారత ప్లేయర్లలో రేణుక సింగ్ 3 వికెట్లు తీశాడు. స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీశారు.
66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 8.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 71 పరుగులు చేసి నెగ్గింది. స్మృతి మంధాన (25 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) శ్రీలంక బ్యాటర్లను రఫ్ఫాడించింది. షఫాలీ వర్మ (5), జెమీమా రోడ్రిగ్స్ (2) విఫలం అయినా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (11 నాటౌట్)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించింది. స్మృతి మంధాన సిక్సర్ తో మ్యాచ్ ను ఫినిష్ చేయడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs srilanka, Smriti Mandhana, Sri Lanka, Team India, Women's Asia Cup