Women's Asia cup 2022- IND W vs THI W 1st semi Final : మహిళల ఆసియా కప్ (Asia cup) 2022 తుది అంకానికి చేరుకుంది. 7 జట్లతో ఆరంభమైన ఈ మెగా టోర్నీ సెమీఫైనల్ దశకు చేరుకుంది. హాట్ ఫేవరెట్ టీమిండియా (Team India)తో పాటు పాకిస్తాన్ (Pakistan), శ్రీలంక (Sri Lanka), థాయ్ లాండ్ (Thailand) మహిళా జట్లు ఆసియా కప్ లో సెమీఫైనల్ కు చేరుకున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ (Bangladesh)కు మాత్రం సొంత గడ్డపై నిరాశ తప్పలేదు. ఇక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ థాయ్ లాండ్ జట్టు తొలిసారి సెమీస్ కు చేరుకుంది. తొలి సెమీఫైనల్లో భాగంగా గురువారం థాయ్ లాండ్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8.30 గంటలకు ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లు ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
ఈ మ్యాచ్ లో థాయ్ లాండ్ టీం డార్క్ హార్స్ గా బరిలోకి దిగనుంది. లీగ్ స్టేజ్ లో ఏకంగా పాకిస్తాన్ లాంటి జట్టుకే థాయ్ లాండ్ షాకివ్వడం విశేషం. దాంతో థాయ్ లాండ్ ను మరీ అంత తక్కువగా అంచనా వేయకుంటేనే మంచిది. అయితే లీగ్ స్టేజ్ లో భాగంగా థాయ్ లాండ్ తో జరిగిన పోరులో భారత్ ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థిని ఆ మ్యాచ్ లో 37 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ లక్ష్యాన్ని 6 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఇక గత మూడు మ్యాచ్ ల్లో ఆడని హర్మన్ ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్ లో ఆడుతుందా? లేదా అనేది అనుమానమే. బ్యాటింగ్ లో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ సూపర్ ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసి వచ్చే అంశం.
ఇక బౌలింగ్ లో దీప్తి శర్మ అదరగొడుతుంది. ఆమెకు తోడు రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్ లు కూడా రాణిస్తుండటంతో ఈ మ్యాచ్ లో గెలవడం భారత్ కు పెద్ద కష్టమేమి కాదు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ పోరులో పాకిస్తాన్ తో శ్రీలంక జట్టు తలపడనుంది.
టీమిండియా (అంచనా)
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హేమలత, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్ రాణా, రిచా ఘోష్, రేణుక సింగ్, మేఘ్నా సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, India, Pakistan, Smriti Mandhana, Sri Lanka, Team India, Thailand, Women's Asia Cup