women world cup: న్యూజిలాండ్ (New Zealand) వేదికగా జరుగుతోన్న మహిళల వన్డే ప్రపంచకప్ (World Cup)లో తాడో పేడో తేల్చుకోవడానికి టీమిండియా (Team India) సిద్ధమైంది. మిథాలీ రాజ్ (Mithali Raj) సారథ్యంలోని భారత (India) మహిళల జట్టు రేపు జరిగే పోరులో దక్షిణాఫ్రికా (South Africa) మహిళల జట్టుతో డూ ఆర్ డై పోరుకు సై అంటోంది. రేపటి మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే సెమీఫైనల్లోకి అడుగుపెడుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం భారత్ సెమీస్ ఆశలు దాదాపుగా ముగిసిపోయినట్లే. దాంతో రేపు జరిగే మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి సెమీఫైనల్ బెర్తు పట్టాలని టీమిండియా భావిస్తోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా(Australia)తో పాటు సెమీస్ చేరిన సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ నామ మాత్రంగా మారింది.
టీమిండియాను వేధిస్తోన్న బ్యాటింగ్
మహిళల ప్రపంచకప్ లో టీమిండియాను బ్యాటింగ్ సమస్య ప్రధానంగా వేధిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో ఒక్క వెస్టిండీస్ జట్టుపైనే మన బ్యాటర్లు చెలరేగారు. మిగిలిన మ్యాచ్ ల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేకపోయారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి మేటి జట్లపై అయితే మరీ ఘోరంగా ఆడారు. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి జట్లపై ఓ మోస్తరుగా ఆడారు. జట్టులో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి స్టార్ బ్యాటర్లకు కొదవలేదు. కానీ, అవసరమైన చోటు వీరు తమ బ్యాట్లను ఝుళిపించలేకపోతున్నారు. స్మృతి మంధాన, యస్తిక భాటియా మాత్రమే నిలకడగా రాణిస్తోండగా... వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే హర్మన్ ప్రీత్ కౌర్ సత్తా చాటింది. ఇక చివరి ప్రపంచకప్ ఆడుతోన్న మిథాలీ రాజ్ జట్టుకు భారంగా కనిపిస్తోంది. ఆమె పలుమార్లు అర్ధ సెంచరీలు సాధించినా అవి జట్టుకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఆమె మరీ నెమ్మదిగా ఆడుతోంది. 60 కంటే తక్కువ స్ట్రయిక్ రేట్ తో ఆమె పరుగులు సాధిస్తోంది. వన్డేల్లో ఈ స్ట్రయిక్ రేట్ సరిపోదు. ఇక బౌలింగ్ లో మాత్రం భారత్ ఫర్వాలేదనిపిస్తోంది. సీనియర్ పేసర్ జులన్ గోస్వామితో పాటు యంగ్ స్నేహ్ రాణా చక్కగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారు. ఈ క్రమంలో సౌతాఫ్రికాపై భారత్ సమష్టి ప్రదర్శనతో గెలవాల్సి ఉంది.
ఓడినా భారత్ కు చాన్స్
సౌతాఫ్రికాపై భారత్ గెలిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ ఓడినా భారత్ కు ఒక రకంగా చాన్స్ ఉంది. రేపటి మ్యాచ్ లో భారత్ ఓడితే... ఇంగ్లండ్ మహిళల జట్టు బంగ్లాదేశ్ చేతిలో భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడే మనం సౌతాఫ్రికా చేతిలో ఓడినా సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. అయితే బంగ్లాదేశ్ లాంటి టీంపై ఇంగ్లండ్ ఓడిపోతుందని మనం భావించలేం. కాబట్టి రేపటి మ్యాచ్ లో భారత్ గెలిస్తే సెమీస్ కు ఎవరి మీదా ఆధారపడకుండా చేరకుంటాం.
ముఖాముఖి పోరులో టీమిండియాదే పైచేయి
సౌతాఫ్రికాతో వన్డేల్లో ముఖాముఖి పోరులో టీమిండియాదే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 27 మ్యాచ్ లు ఆడగా... అందులో భారత్ 15 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. సఫారీ టీం 11 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ రేపు ఉదయం 6.30 నిమిషాల నుంచి స్టార్ స్టోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రత్యక్షప్రసారం అవుతుంది.
టీమిండియా తుది జట్టు అంచనా
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్, స్నేహ్ రాణా, పుజా వస్త్రాకర్, జులన్ గోస్వామి, మేఘ్నా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, India, India vs South Africa, Mithali Raj, Smriti Mandhana, South Africa, Team India, World cup