Women World Cup: దాదాపు నెల రోజుల పాటు క్రికట్ అభిమానులను అలరించిన మహిళల వన్డే ప్రపంచకప్ (Women World Cup) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రేపు జరిగే ఫైనల్లో 6 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ (England) మహిళల టీం తాడో పేడో తేల్చుకోనుంది.
Women world cup: దాదాపు నెల రోజుల పాటు క్రికట్ అభిమానులను అలరించిన మహిళల వన్డే ప్రపంచకప్ (Women World Cup) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రేపు జరిగే ఫైనల్లో 6 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ (England) మహిళల టీం తాడో పేడో తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ఈ ఫైనల్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఓటమనేదే ఎరుగని మెగ్ ల్యానింగ్ నాయకత్వంలోని ఆసీస్... ఈ ఆఖరి ఫైట్ లోనూ గెలిచి విశ్వవిజేతగా తేలేందుకు పట్టుదలగా ఉంది. మరోవైపు తొలి మూడు మ్యాచ్ ల్లోనూ ఓడినా... అనంతరం పుంజుకుని వరుస విజయాలతో ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జట్టు కూడా వరుసగా రెండోసారి, ఓవరాల్ గా ఐదోసారి ప్రపంచకప్ ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే ఫైనల్ హోరాహోరీగా సాగడం ఖాయం.
కేవలం రెండు వన్డేల్లో మాత్రమే
2017లో జరిగిన వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా మహిళల జట్టు సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓడింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు వన్డేల్లో కేవలం రెండు మ్యాచ్ ల్లోనే ఓడటం విశేషం. అంటే గత ఐదేళ్లుగా ఆస్ట్రేలియా జట్టు ఎలాంటి ఫామ్ లో ఉందో ఇట్టే అర్థం అవుతోంది. రాచెల్ హైన్స్, అలీసా హీలీలతో ఆసీస్ ఓపెనింగ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఇక మిడిలార్డర్ లో మెగ్ ల్యానింగ్, బెత్ మూనీ, తహిలా మెక్ గ్రాత్ ఉండనే ఉన్నారు. ఇక బౌలింగ్ లోనూ ఆస్ట్రేలియా తిరుగులేకుండా ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే ఫైనల్లో విజేతగా నిలిచి 9 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించేందుకు ఆసీస్ సిద్ధంగా ఉంది.
ఇక మరోవైపు ఇంగ్లండ్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టోర్నీలో అడుగు పెట్టిన ఇంగ్లండ్ జట్టు లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడింది. దాంతో ఆ జట్టు సెమీస్ చేరుతుందా అనే అనుమానాలు కలిగాయి. అయితే అనంతరం పుంజుకున్న టీం వరుస విజయాలతో సెమీస్ లో అడుగు పెట్టింది. ఇక అక్కడ పటిష్ట సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించి ఫైనల్ చేరింది. డానిల్లె వ్యాట్, హీథర్ నైట్, నాట్ స్కీవర్ జట్టుకు కీలకం కానున్నారు. టామీ బీమౌంట్ ఫామ్ పై జట్టు ఆందోళలో ఉంది. అయితే టోర్నీలో ఇంగ్లండ్ కమ్ బ్యాక్ చేసిన విధానం... ఆ జట్టును తక్కువగా అంచనా వేయొద్దని చెబుతోంది.
ముఖాముఖి రికార్డు
ముఖాముఖి రికార్డులో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 152 సార్లు తలపడ్డాయి. అందులో ఆస్ట్రేలియా 84 సార్లు విజయం సాధిస్తే... ఇంగ్లండ్ 61 సార్లు గెలిచింది. ఈ ప్రపంచకప్ లో ఈ రెండు జట్లు చివరి సారిగా తలపడ్డాయి. లీగ్ దశలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 13 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు ప్రపంచకప్ ఫైనల్స్ జరగ్గా... ఈ రెండు సార్లు కూడా ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.