Wimbledon 2022 : వ్యాక్సిన్ వేయించుకోలేదన్న కారణంతో ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ ఈవెంట్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)లో ఆడలేదు. ఫ్రెంచ్ ఓపెన్ (French Open 2022)లో బరిలోకి దిగినా క్వార్టర్ ఫైనల్లో మట్టికోర్టు మహారాజు రఫేల్ నడాల్ (Rafael Nadal) చేతిలో ఓటమి. దాంతో ఎన్నడూ లేని విధంగా నొవాక్ జొకోవిచ్ (Novak Djokovic) ఈ ఏడాదిలో ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ ను కూడా దక్కించుకోలేకపోయాడు. వయసు మీద పడుతుండటం అదే సమయంలో కొత్త కుర్రాళ్లు అదరగొడుతుండటంతో ఈ ఏడాది గ్రాండ్ స్లామ్ టైటిల్ లేకుండానే ముగిస్తాడా అని అంతా భావించారు. అయితే వీటిన్నింటిని పటాపంచలు చేస్తూ తనకు అచ్చొచ్చిన గ్రాస్ కోర్టు అయిన విఖ్యాత వింబుల్డన్ (Wimbledon)లో చెలరేగిపోయాడు.
ఆదివారం పురుషుల విభాగంలో జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ 4-6, 6-3, 6-4, 7-6 (7/3)తో టెన్నిస్ బ్యాడ్ బాయ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై ఘనవిజయం సాధించాడు. జొకోవిచ్ కెరీర్ లో ఇది 21వ గ్రాండ్ స్లామ్ కావడం విశేషం. అంతేకాకుండా వింబుల్డన్ లో చాంపియన్ గా నిలువడం జొకోవిచ్ కు ఇది ఏడోసారి. ఫలితంగా పురుషుల విభాగంలో నడాల్ (22 టైటిల్స్) తర్వాత అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ప్లేయర్ గా జొకోవిచ్ నిలిచాడు. స్విస్ వీరుడు రోజర్ ఫెడరర్ (20 టైటిల్స్) మూడో స్థానంలో ఉన్నాడు.
నడాల్ పొత్తికడుపు గాయంతో సెమీఫైనల్ నుంచి తప్పుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో టేలర్ తో ఆడే సమయంలో గాయం బారిన పడ్డాడు. అయినా గాయంతోనే ఆడుతూ ఆ మ్యాచ్ లో విజయం సాధించిన నడాల్.. సెమీస్ చేరుకున్నాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువైతే ప్రమాదకరం అనే ఆలోచనతో కిరియోస్ తో జరిగే సెమీస్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో కిరియోస్ ఫైనల్లో అడుగుపెట్టాడు. కిరియోస్ కు ఇదే తొలి ఫైనల్ కావడం విశేషం. టెన్నిస్ లో కిరియోస్ కు బ్యాడ్ బాయ్ అనే ముద్ర ఉంది. కోర్టులో ఉమ్మివేయడం.. తరచూ అభిమానులతో దూషణకు దిగడంతో పాటు.. చైర్ అంపైర్లతో గొడవ పడుతుంటాడు. దాంతో అతడిని అందరూ బ్యాడ్ బాయ్ అంటారు.
ఇక ఫైనల్లో తొలి సెట్ విజయం సాధించిన కిరియోస్ గ్రాండ్ స్లామ్ కలను నెరవేర్చుకునేలా కనిపించాడు. అయితే జొకోవిచ్ బౌన్స్ బ్యాక్ అవ్వడం.. అదే సమయంలో కిరియోస్ తన అనవసరపు వాదనలతో గేమ్ పై ఏకాగ్రతను కోల్పోయాడు. దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్న జొకోవిచ్ రెండు మూడు సెట్లను పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకున్నాడు. ఇక నాలుగో సెట్ లో ఇరువురు కూడా తమ సర్వీస్ లను కాపాడుకోవడంతో సెట్ టై బ్రేక్ కు దారితీసింది. ఇక్కడ అద్భుతంగా ఆడిన జొకోవిచ్ వింబుల్డన్ విజేతగా నిలిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: French open, Novak Djokovic, Rafael Nadal, Roger Federer, Us open, Wimbledon