ప్రపంచాన్ని అతలాకుతం చేసిన కోవిడ్-19 (Covid 19) మహమ్మారి కారణంగా గత ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను (ICC T20 World Cup) వాయిదా వేశారు. 2020లో జరగాల్సిన ఆ మెగా టోర్నీని 2022లో నిర్వహిస్తామని ఐసీసీ (ICC) చెప్పింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉన్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లలో బీసీసీఐ (BCCI), ఐసీసీ నిమగ్నమై ఉన్నాయి. అయితే కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఇండియాలో ప్రతీ నిత్యం 1 లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) ఆడటానికి ముంబై, చెన్నై చేరుకున్న ఆయా జట్ల ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడి ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియం గ్రౌండ్స్‌మెన్‌తో పాటు బ్రాడ్‌కాస్టింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ సిబ్బందికి కరోనా బారిన పడటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 6 నెలల్లో జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కేసులు ఇలాగే పెరుగుతుంటే ఆ మెగా టోర్నీ జరుగుతుందా లేదా అనే సందిగ్దం నెలకొన్నది.
ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌పై ఐసీసీ సీఈవో జెఫ్ అలర్డైస్ (ICC CEO) కీలక ప్రకటన చేశారు. 'ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని భావిస్తున్నాము. కోవిడ్-19 మరింత తీవ్ర రూపం దాల్చితే అప్పుడు తప్పకుండా దీనిపై ఆలోచిస్తాము. ఇప్పటికే ఐసీసీ వద్ద ప్లాన్ బి కూడా ఉన్నది. కానీ ఆ ప్లాన్ ఏమిటనేది ఇప్పటికిప్పుడు వెల్లడించలేము. కానీ ఈ ఏడాది మాత్రం టీ20 వరల్డ్ కప్ జరిగి తీరుతుంది' అని ఆయన స్పష్టం చేశారు. ఐసీసీ బోర్డు సభ్యులు, క్రికెట్ కమిటీ సభ్యులతో జరిగిన వర్చువల్ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. టీ20 వరల్డ్ కప్ విషయంలో బీసీసీఐతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ విజవంతం అయితే టీ20 వరల్డ్ కప్‌కు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. మరోవైపు గత ఏడాది కోవిడ్ సమయంలో యూఏఈ ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించింది. 8 జట్లు పాల్గొన్న ఈ లీగ్‌కు అవసరమైన సదుపాయాలన్నీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు కల్పించింది. దీంతో ఐసీసీ చెప్పే ప్లాన్ బి అంటే యూఏఈ అయి ఉండొంచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఐసీసీ సీఈవో మనూసాహ్ని పలు ఆరోపణలతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో తాత్కాలిక సీఈవోగా ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ బాధ్యతలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, ICC, IPL, T20 World Cup 2021