Cricket: నెక్ట్స్ కోచ్ రాహుల్ ద్రవిడేనా? టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవిపై పెదవి విప్పిన ద్రవిడ్

భారత జట్టుకు తర్వాతి కోచ్ పదవిపై పెదవి విప్పిన రాహుల్ ద్రవిడ్

భారత క్రికెట్ జట్టుకు తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అవుతారని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిస్టర్ వాల్ శ్రీలంక పర్యటన అనంతరం ఏం చెప్పాడో తెలుసా?

 • Share this:
  భారత యువ క్రికెట్ (Team India) జట్టు శ్రీలంక పర్యటనను (Srilanka Tour) ముగించుకొని వచ్చింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా, కేఎల్ రాహుల్ లేకుండానే శ్రీలంకకు ఒక జట్టును బీసీసీఐ పంపింది. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో రాణించిన వాళ్లతో పాటు టెస్టు జట్టులో భాగంగా లేని క్రికెటర్ల నుంచి 20 మందిని ఎంపిక చేసి శ్రీలంకతో సిరీస్ ఆడటానికి పంపింది. ఆటగాళ్లను అయితే బెంచ్ నుంచి ఎంపిక చేశారు? మరి కోచ్  (Coach) ఎవరు అనే డౌట్ రాగానే అందరి మదిలో మెదిలింది రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid). భారత యువ క్రికెటర్లను మెరికల్లాగా తయారు చేసిన అనుభవం ఉన్నది. అండర్ 19, ఇండియా ఏ వంటి జట్లకు కోచ్‌గా మంచి ఫలితాలను రాబట్టిన వ్యక్తి. నేషనల్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ సీనియర్ క్రికెటర్ల టెక్నిక్ లోపాలను కూడా సరి చేసిన అనుభవం అతడితి. నేషనల్ డ్యూటీకి పిలవగానే ఎలాంటి సాకులు చెప్పకుండా రాహుల్ ద్రవిడ్ రంగంలోకి దిగిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న కొద్ది మందితో.. అసలు జాతీయ జట్టులోకే తొలి సారిగా వచ్చిన ఎక్కువ మంది క్రికెటర్లతో కలసి ద్రవిడ్ శ్రీలంక గడ్డపై అడుగుపెట్టాడు. కోవిడ్ కారణంగా సిరీస్‌లో కొన్ని ఆటంకాలు ఏర్పడినా.. చివరకు విజయవంతంగా ముగించేశారు. భారత జట్టు వన్డే సిరీస్ గెలవగా.. శ్రీలంక జట్టు టీ20 సిరీస్ నెగ్గింది. ఎలా చూసుకున్నా.. ద్రవిడ్ కోచింగ్ నేపథ్యంలో టీమ్ ఇండియా ఈ పర్యటనను విజయవంతంగా ముగించిందనే చెప్పుకోవచ్చు. సాధారణంగా టీమ్ ఇండియా ఓడిపోతే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్స్ మామూలుగా ఉండవు. కానీ అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఓడిపోయిందో చూశారు కాబట్టే కనీసం ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా పెట్టలేకపోయారు.

  ఇప్పుడు అది కాదు అసలు విషయం.. రాహుల్ ద్రవిడ్ తొలి సారిగా భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టి తన టాలెంట్ నిరూపించకున్నాడు. వన్డేల్లో రెండో మ్యాచ్ ఓడిపోయే దశలో ఉంటే.. అతడు పంపిన సందేశాల వల్లే దీపక్ చాహర్ మ్యాచ్‌ను గెలిపించిన విషయం ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఈ ఏడాది చివర్లో హెడ్‌కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం కూడా ముగిసిపోతున్నది. దీంతో నెక్ట్స్ కోచ్ ఎవరనే ప్రశ్న అందరి మదిలో తొలుస్తున్నది. శ్రీలంక పర్యటనకు రాహుల్ ద్రవిడ్‌ను పంపిన బీసీసీఐ.. ఆయన కనుక ఆ పదవిని స్వీకరించడానికి ముందుకు వస్తే కచ్చితంగా సానుకూలంగానే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. భారత జట్టు రాబోయే రెండేళ్లలో కఠినమైన టెస్టు సిరీస్‌లతో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా ఆడాల్సి ఉన్నది. స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు జట్టును సిద్దం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ నేథ్యంలో కోచ్‌గా ద్రవిడ్ అయితేనే సరిపోతాడని అందరూ భావిస్తున్నారు. యువ క్రికెటర్లలో చాలా మంది ద్రవిడ్ శిష్యులే కావడం.. రాబోయే రెండేళ్లలో వాళ్లే టీమ్ ఇండియాలో కీలక పాత్ర పోషించనుండటంతో ద్రవిడ్ వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు.

  అయితే శ్రీలంక పర్యటన ముగించుకొని వచ్చిన ద్రవిడ్‌ను ఇదే విషయం అడిగితే భిన్నంగా స్పందించాడు. 'శ్రీలంక పర్యటన నాకు మంచి అనుభవం. నేను చాలా సంతోషించాను. నేను ఈ పర్యటన గురించే ఆలోచించాను తప్ప వేరేది నా మనసులో లేదు. ఈ కుర్రాళ్లతో పని చేయడం నాకు ఇష్టం. ఇది నాకు తాత్కాలిక బాధ్యతే. ఫుల్ టైం పని చేయాలంటే చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాలి. అయితే దానికి నేను సిద్దంగా ఉన్నానా అంటే ఇప్పుడు చెప్పలేను' అని అన్నాడు. అయితే ద్రవిడ్ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా హెడ్‌ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని అతడి సన్నిహితులతో పాటు క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
  Published by:John Naveen Kora
  First published: