క్రికెట్‌లో (Cricket) అంపైర్లంటే (Umpire) ఏ జట్టు వైపు పక్షపాత బుద్దితో ఉండకుండా నిష్పక్షపాతంగా ఉండాలి. అప్పుడే ఏ జట్టుకైనా అంపైర్ల మీద గౌరవం పెరుగుతుంది. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ అంపైర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సైమన్ టౌఫెల్ (Simon Taufel)) మాత్రం ధోనీ (MS Dhoni) సిక్స్ కొట్టి 2011లో టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ (World Cup) తెచ్చి పెడితే హాయిగా ఊపిరి పీల్చుకున్నాడట. అదేంటి ఒక జట్టు గెలిస్తే అంపైర్ ఇలా అనడం ఏమిటని మీకు అనుమానం రావొచ్చు. కానీ సైమన్ టౌఫెల్ ఊపిరి పీల్చుకున్నది ఇండియా గెలిచినందుకు కాదంటా.. ఈ భారీ టోర్నీ ముగిసిపోయింది. ఎలాంటి వివాదాలు, పిర్యాదులు లేకుండా ఫైనల్ ముగిసిందని ఊపిరి పీల్చుకున్నాడంటా. వరల్డ్ కప్ ఫైనల్‌లో అంపైరింగ్ చేయడం ఎంత ఒత్తిడితో కూడుకున్న వ్యవహారమే ఆయన ఇటీవల ఐసీసీ మీడియా టీమ్‌తో పంచుకున్నాడు. ఇండియా వరల్డ్ కప్ గెలిచి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇంకా టౌఫెల్ ఏమన్నారంటే.. 'నా దృష్టిలో మొహలీలో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీఫైనలే ఫైనల్ అని భావిస్తాను. ఆ రోజు ప్రపంచమంతా మా అంపైరింగ్‌నే చూస్తున్నట్లు అనిపించింది. అందరూ చండీఘర్ విమానాశ్రయంలో తమ ఫ్లైట్లను పార్క్ చేసి గ్రౌండ్‌లో కూర్చున్నట్లు ఉంది. ఆ మ్యాచ్ ఇండియా గెలవడం ఫైనల్‌కు వెళ్లడం జరిగింది' అని టౌఫెల్ అన్నారు
ఇక ముంబైలో జరిగిన ఫైనల్ రెండో ఫైనల్ అని భావించిను అని టౌఫెల్ అన్నారు. ఆ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు నేను ఒత్తిడిలోనే ఉన్నాను. ఏమైనా తప్పులు చేస్తానేమో అని భయపడ్డాను. కానీ ధోనీ సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించాక.. హమ్మయ్య అయిపోయింది అని ఊపిరి పీల్చుకొని నా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాను. అక్కడ నుంచి చూస్తుంటే మైదానంలో సచిన్‌ను ఊరేగిస్తున్నారు.. అలాగే సంబరాలు జరుపుకునే వాళ్లు బాధతో ఓదార్చుకునే వాళ్లు కనపడ్డారు. కానీ ఒక మెగా టోర్నీని విజయవంతంగా ముగించినందుకు నా భుజాలపై నుంచి పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించిందని సైమన్ చెప్పుకొచ్చారు.
కాగా, ముంబై వాంఖడేలో జరిగిన ఫైనల్‌లో భారత జట్టు శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 28 ఏళ్ల తర్వాత తిరిగి వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు 48.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. గంభీర్ (97), ధోనీ (91) జట్టును విజయతీరాలకు చేర్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Cricket world cup 2011, MS Dhoni, Team India