టీమ్ ఇండియా (Team India) యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ (Shubman gill) టెస్ట్ క్రికెటర్‌గా స్థానం సంపాదించాడు. అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న గిల్ జాతీయ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడటానికి ప్రస్తుతం టీమ్ ఇండియాతో కలసి ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా కఠినమైన క్వారంటైన్‌కు పరిమితం అయిన టీమ్ ఇండియా.. ఇప్పుడే బయటకు వచ్చి మ్యాచ్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ ఒక యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. అందులో పలు విషయాలు పంచుకున్నాడు. మైదానంలోకి దిగే సమయంలో తన ట్రౌజర్‌కు (Trouser) ఎర్ర కర్చీప్ (Red Handkerchief) దోపుకొని కనపడుతుంటాడు. చాలా కాలంగా గిల్‌ను గమనించిన వాళ్లు ఎర్ర కర్చీప్‌ను గుర్తించే ఉంటారు. అసలు ఆ కర్చీప్ ఎందుకు అలా పెట్టుకుంటాడని ప్రశ్నించగా.. ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి గిల్‌కు ఇలా ఎర్రకర్చీప్ వెంట పెట్టుకొని వెళ్లే అలవాటు లేదంటా. కేవలం ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ నుంచే దాన్ని అలవాటు చేసుకున్నాడు. గిల్ చాలా కాలం దేశవాళీ క్రికెట్ ఆడాడు. అత్యధిక మ్యాచ్‌లు ఎర్ర రంగు బంతితోనే ఆడేవాడు. తొలి సారిగా అండర్ 19 వరల్డ్ కప్ సమయంలో తెల్లబంతులతో క్రికెట్ ఆడాడు. ఆ రోజు ఎందుకో ఎర్ర కర్చీప్ వెంట పెట్టుకొని వెళ్లాడు. అప్పుడు మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేశాడు. దీంతో అలా ఎర్ర కర్చీప్ పెట్టుకొని పోవడం అలవాటు చేసుకున్నాడు.
'సాధారణంగా ఎర్ర బంతులతో ఆడే సమయంలో అలా ఎర్ర కర్చీప్ పెట్టుకొని వెళ్తే అంపైర్లు అభ్యంతరం చెబుతారు. కానీ తెల్లబంతుల మ్యాచ్‌లలో పెద్దగా అభ్యంతరం ఉండదు. అందుకే తాను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఎర్ర కర్చీప్ పెట్టుకొని వెళ్తాను. నాకు ఎరుపంటే ఇష్టం. అలాగే ఆ కర్చీప్ ధరించి వెళ్తే నాకు మంచి జరుగుతుందనే సెంటిమెంట్ కూడా ఉంది. అందుకే అలా కంటిన్యూ చేశాను' అని గిల్ చెప్పుకొచ్చాడు.
ఇది సెంటిమెంటా లేదా మరొకటా అని గిల్ ఎప్పుడూ ఆలోచించలేదంటా.. ఒక సారి అలా కర్చీప్ పెట్టుకోవడం అలవాటయ్యాక దానిని వదల్లేకపోతున్నా అని చెప్పాడు. కాగా, టీమ్ ఇండియా తరపున 7 టెస్టులు, 3 వన్డేలు ఆడిన గిల్ టెస్టుల్లో 378, వన్డేల్లో 49 పరుగులు చేశాడు. గబ్బా టెస్టులో 91 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ టెస్టును టీమ్ ఇండియా గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కుతుందని గిల్ ఆశిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Team India, WTC Final