Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌ మెడల్స్ లిస్టులో రష్యా పేరు ఎందుకు లేదు? లిస్టులో ఉన్న ఆర్వోసీ ఎక్కడిది?

ఒలింపిక్స్‌లో ఆర్వోసీ ఎక్కడిది? మెడల్స్ లిస్టులో రష్యా ఎందుకు లేదు?

టోక్యో ఒలింపిక్స్‌ మెడల్స్ లిస్టులో రష్యా పేరు కనిపించడం లేదు. దీని వెనుక పెద్ద కారణమే ఉన్నది. అదేంటో ఒకసారి చదివేయండి.

  • Share this:
    టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) ప్రారంభమై 8 రోజులు గడిచి పోయింది. అనేక దేశాలు పతకాల వేట ప్రారంభించాయి. ఒలింపిక్స్‌లో మెడల్స్ కొట్టాలి అంటే అమెరికా, చైనా తర్వాత రష్యన్ అథ్లెట్లే ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్ల హవా ఎక్కువగా ఉండేది. వాళ్ల తర్వాతే అమెరికా పతకాల సంఖ్య కనపడేది. రాను రానూ రష్యా (Russia) ప్రభావం తగ్గింది. కానీ కచ్చితంగా టాప్-5లో మాత్రం ఉండే తీరుతుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రష్యన్ అథ్లెట్లు 10 స్వర్ణపతకాలు, 17 రజతం, 20 కాంస్యాలతో మొత్తం 56 పతకాలు కొల్లగొట్టారు. మెడల్స్ టాలీలో రష్యన్లు 4వ స్థానంలో నిలిచారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో ఈ రోజు (జులై 30) వరకు ఉన్న టాలీ చూసుకుంటే రష్యా పేరు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఒక్క పతకం కూడా రష్యా దేశం కొల్లగొట్టిన దాఖలాలు లేవు. అసలు రష్యా ఒలింపిక్స్‌లో ఆడటం లేదా మరేదైనా కారణమా అని అనుకుంటున్నారా? అవును.. ఒక పెద్ద కారణమే ఉన్నది.

    టోక్యో ఒలింపిక్స్ 2020లో రష్యాకు చెందిన 335 మంది అథ్లెట్లు పలు క్రీడా విభాగాల్లో పోటీ పడుతున్నారు. కానీ ఇతర దేశాల లాగా రష్యన్ అథ్లెట్లు తమ దేశం పేరును వాడుకునే వీలు లేకుండా పోయింది. దేశం పేరు, జెండా, జాతీయ గీతాన్ని ఉపయోగించకుండానే రష్యన్ అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. ఒలింపిక్స్‌లో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన రష్యా.. ఈ సారి వింత పరిస్థితిని ఎదుర్కుంటున్నది. తమ దేశం పేరు వాడుకోవడానికి నిషేధం విధించడంతో ఆర్వోసీ (రష్యన్ ఒలింపిక్ కమిటీ) పేరుతో బరిలోకి దిగారు. మెడల్స్ లిస్టులో కనపడుతున్న ఆర్వోసీ అంటే రష్యన్ అథ్లెట్లే. ఇప్పటి వరకు ఆర్వోసీ ఆటగాళ్లు 10 స్వర్ణం, 14 రజతం, 10 కాంస్య పతకాలు నెగ్గి నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే రష్యాపై నిషేధానికి కారణం ఉన్నది.

    అంతర్జాతీయ పోటీలు, టోక్యో ఒలింపిక్స్, ఫిఫా వరల్డ్ కప్ 2022లో పాల్గొనకుండా రష్యాను 2019 డిసెంబర్‌లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిషేధం విధించింది. కొన్నేళ్లుగా రష్యా తమ అథ్లెట్లు డోప్ టెస్టుల్లో పట్టుబడకుండా ఒక అధునాతనమైన విధానాన్ని కనిపెట్టి అమలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాచి. దీంతో అంతర్జాతీయ ఫెడరేషన్లు రష్యన్ అథ్లెట్లను పోటీ పడటాన్ని నిషేధించారు. సెప్టెంబర్ 2018లో అనేక విచారణల అనంతరం వాడా ఒక నిబంధనపై రష్యన్ అథ్లెట్లను అనుమతించడానికి అంగీకరించింది. మాస్కోలోని లాబ్‌కు చెందిన అథ్లెట్ల డేటాను తమకు అందిస్తే తాను అప్పుడు అనుమతిస్తామని చెప్పింది. ఆ డేటాను వాడాకు ఇవ్వగా.. వందలాది మంది రష్యన్ అథ్లెట్లు డోపీలు అని తేలిపోయింది. ఆ డేటా ఆధారంగా రష్యాను అంతర్జాతీయ క్రీడల నుంచి నాలుగేళ్ల పాటు నిషేధించారు.

    అసలు రష్యా చేస్తున్న ఈ డోపింగ్ కార్యక్రమాన్ని బయటపెట్టింది కూడా రష్యాకు చెందిన అథ్లెట్లే కావడం గమనార్హం. 2014లో 800 మీటర్ల రన్నర్ యులియా స్టెపనోవా, ఆమె భర్త విటాలీ ఈ విషయాన్ని ఒక జర్మన్ డాక్యుమెంటరీలో వివరించారు. విటాలీ రష్యన్ యాంటీ డోపింగ్ ఏజెన్సీలో మాజీ ఉద్యోగి కావడం గమనార్హం. రెండేళ్ల తర్వాత రష్యా యాంటీ గోపింగ్ ఏజెన్సీ మాజీ చీఫ్ గ్రిగొరీ రోడ్‌చెంకోవ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు. రష్యా తమ అథ్లెట్లను డోపింగ్ చేయిస్తున్నదని.. ఇదంతా ఒక క్రమమైన పద్దతిలో జరిగిపోతూ... బయటకు వెల్లడించకుండా వ్యవస్థలను తయారు చేశారని చెప్పాడు. అలా రష్యా కుట్ర బయటపడి.. చివరకు విచారణలో అసలు విషయం తెలిసిపోయింది.

    కాగా, 2020లో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ నాలుగేళ్ల నిషేధాన్ని రెండేళ్లకు తగ్గించింది. అంతేకాకుండా ఏ రష్యా టీమ్ కూడా వాడా అనుమతి లేకుండా అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనరాదని ప్రకటించింది. రష్యాలో కూడా ఎలాంటి క్రీడా ఈవెంట్లు నిర్వహించకూడదని తేల్చి చెప్పింది. కాగా, రష్యా అనే మాట వినిపించకుండా కేవలం ఆర్వోసీ అనే పేరుతో రష్యన్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ఐవోసీ అనుమతి ఇచ్చింది. వాడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కానీ ఐవోసీదే తుది నిర్ణయం కావడంతో రష్యన్ ఆటగాళ్లు ఆర్వోసీ పేరుతో టోక్యో ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు.
    Published by:John Naveen Kora
    First published: