శ్రీలంక పర్యటనకు (Srilanka Tour) వెళ్లిన టీమ్ ఇండియా (Team India) ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే ఆడింది. ఆతిథ్య శ్రీలంకను పర్యాటక ఇండియా చిత్తుచిత్తుగా ఓడించింది. ఇండియా బౌలర్లు తొలుత కట్టడి చేసినా చివర్లో చేతులెత్తేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 262 పరుగులు చేసింది. 263 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు పృథ్వీషా, ఇషాన్ కిషన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో 40 ఓవర్ల లోపే కొట్టేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక వైపు క్రీజులో నిలబడి 86 పరుగులు చేసినా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పృథ్వీషాకే ఇచ్చారంటే అతడి ధాటికి ఎంత మంది ఇంప్రెస్ అయ్యారో అర్దం చేసుకోవచ్చు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేశారు. పుట్టిన రోజు నాడే అంతర్జాతీయ వన్డేలో అరంగేట్రం చేసిన రెండో భారతీయ క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) తొలి బంతికే సిక్స్ (First Ball Six) బాదాడు. ఇది కూడా ఒక రికార్డు. అయితే తొలి బంతికే కిషన్ ఎందుకు సిక్స్ కొట్టాడో మ్యాచ్ అనంతరం యజువేంద్ర చాహల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి ఇషాన్ కిషన్ కంటే సీనియర్ అయిన సంజూ శాంసన్ తొలి వన్డేలో చోటు దక్కించుకోవాలి. కానీ సంజూ బాబా గాయంతో బాధపడుతుండటంతో ఆ అవకాశం జార్ఖండ్ నయా డైనమైట్ ఇషాన్ కిషన్‌కు దక్కింది. తొలి బంతినే స్టాండ్స్‌లోకి తరలించి అందరినీ ఆశ్చర్యపరచిన ఇషాన్ కిషన్ దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని చెప్పాడు. 'శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నేను 50 ఓవర్ల పాటు కీపింగ్ చేశాను. పిచ్ స్పిన్నర్లకు సహకరించడం లేదన్న విషయాన్ని నేను గమనించాను. దీంతో నేను కనుక బ్యాటింగ్‌కు వస్తే తొలి బంతి ఎక్కడ పడినా సిక్స్ కొట్టాలని నిర్ణయించుకున్నాను. శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన తర్వాత అందరితో ఇదే విషయాన్ని చెప్పాను. ఫస్ట్ బాల్కి సిక్స్ కొడతా అని ఛాలెంజ్ చేశాను. అందులో అది నా పుట్టిన రోజు కావడంతో ఆ సిక్స్ నాకు నేను ఇచ్చుకునే బహుమతి అనుకున్నాను.' అని కిషన్ చెప్పుకొచ్చాడు.
Chahal TV returns - Ishan Kishan reveals the secret behind his first ball SIX and more 👌 👌
ఇషాన్ కిషన్ తొలి బంతికి సిక్స్ కొట్టడమే కాకుండా తొలి వన్డేలోనే అర్ద సెంచరీ నమోదు చేశాడు. అంతకు ముందు ఇంగ్లాండ్‌పై టీ20ల్లో అరంగేట్రం చేసిన కిషన్.. తన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. టీమ్ ఇండియా తరపున తొలి వన్డే, తొలి టీ20ల్లో అర్దసెంచరీ నమోదు చేసిన రెండో బ్యాట్స్‌మాన్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు రాబిన్ ఊతప్ప ఈ ఫీట్ నమోదు చేశాడు. టీమ్ ఇండియా మ్యాచ్ అనంతరం యజువేంద్ర చాహల్ 'చాహల్ టీవీ' పేరుతో పలువురిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. బీసీసీఐ టీవీ తరపున ఈ ఇంటర్వ్యూలు చేస్తూ అందరినీ అలరిస్తుంటాడు. చాలా కాలం తర్వాత చాహల్ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ ఇంటర్వ్యూతో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.