టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. వికెట్ల వెనుక ఒక విజయవంతమైన కీపర్‌గానే కాకుండా, ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అది ఇప్పటి మాట.. కానీ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టక ముందే బీసీసీఐ సెలెక్టర్ ఒకరు అతడిలోని టాలెంట్‌ను గుర్తించారు. అంతే కాకుండా పట్టుబట్టి మరీ అతడిని తుది జట్టులోకి తీసుకునేలా అప్పటి కెప్టెన్‌పై ఒత్తిడి తెచ్చాడు. అతనే అప్పటి సెలెక్టర్, మాజీ క్రికెటర్ కిరణ్ మోరే. అసలు అప్పుడు ఏం జరిగిందో కిరణ్ మోరే (Kiran More) తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. '2003 వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియాకు ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అవసరం ఉన్నది. రాహుల్ ద్రవిడ్ అప్పటికే 75 మ్యాచ్‌ల పాటు వికెట్ కీపింగ్ చేశాడు. అది అతడి బ్యాటింగ్‌పై భారం పడుతుండటం గమనించాము. అందుకే ఒక స్పెషలిస్ట్ వికెట్ కీపర్.. అందులో 7 లేదా 8వ స్థానంలో ఆడుతూ ఒక 40 నుంచి 50 పరుగులు చేయగలిగే క్రికెటర్ కోసం అన్వేషించాము. అప్పుడే నేను ధోనీని చూశాను' అని కిరణ్ మోరే చెప్పాడు. 'ఒక దేశవాళీ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు స్నేహితుడు నన్ను తీసుకొని వెళ్లాడు. ఆ మ్యాచ్‌లోనే ధోనీని తొలి సారిగా చూశాను. ప్రతీ బౌలర్‌పై ఆధిపత్యం చేస్తూ భారీ స్కోర్ సాధించాడు. ఆ రోజు మ్యాచ్‌లో జట్టు స్కోర్ 170 అయితే 130 పరుగులు ధోనీనే చేశాడు. దీంతో అతడిపై నాకు నమ్మకం కుదిరింది. ధోనీని ఫైనల్ మ్యాచ్‌లో ఆడించాలని భావించాను' అని కిరణ్ మోరే వెల్లడించాడు.
కాగా, ఈస్ట్ జోన్ తరపున ఫైనల్ మ్యాచ్‌లో ధోనీని తీసుకోవాలని కెప్టెన్ సౌరవ్ గంగూలీపై కిరణ్ మోరే ఒత్తిడి తీసుకొని వచ్చాడు. కానీ గంగూలీ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అప్పటికే ఈస్ట్ జోన్‌ను దీప్ దాస్ గుప్త రెగ్యులర్ కీపర్‌గా ఉన్నాడు. దీంతో అతడిని తప్పించి వేరే కీపర్‌కు జట్టులో చోటు కల్పించలేనని గంగూలీ స్పష్టం చేశాడు. కానీ కిరణ్ మోరే మాత్రం పట్టు వదలకుండా గంగూలీ వెంటపడ్డాడు. అలా 10 రోజుల పాటు గంగూలీని బతిమిలాడగా.. చివరకు ఓకే చెప్పాడని మోరే అన్నాడు. ఆ మ్యాచ్‌లో బరిలోకి దిగిన ధోనీ.. గంగూలీని కూడా మెప్పించాడు. దీంతో బంగ్లాదేశ్ పర్యటనకు ధోనీ పేరును గంగూలీ సజెస్ట్ చేశాడు. అప్పుడు సెలెక్షన్ ప్యానెల్లో మోరే ఉండటంతో ధోనీకి చోటు దక్కింది.
2004లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేసినా.. సరైన ఆరంభం లభించలేదు. ఆ పర్యటనలో వరుసగా విఫలం చెందాడు. అయినా సరే ధోనీని గంగూలీ తుది జట్టు నుంచి తప్పించలేదు. ఆ తర్వాత పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. విశాఖ వేదికగా పాకిస్తాన్ జట్టుపై ధోనీ సృష్టించిన పరుగుల సునామీ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. అలా ఎంఎస్ ధోనీ భారత జట్టులో తన స్థానాన్ని శాశ్వతం చేసుకున్నాడు. జట్టులోకి రావడానికి కిరణ్ మోరే కారణమైతే.. అతడిని ప్రోత్సహించింది మాత్రం సౌరవ్ గంగూలీ. ఇక భారత జట్టు కెప్టెన్సీని గంగూలీ నుంచి ఎంఎస్ ధీనికి బీసీసీఐ అప్పగించింది. ఆ తర్వాత జరిగింది అంతా చరిత్రే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, MS Dhoni, Sourav Ganguly, Team India