టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) పాల్గొనడానికి ఇండియా నుంచి 100 మంది అథ్లెట్లు త్వరలో జపాన్ (Japan) వెళ్లనున్నారు. గత గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో భారత అథ్లెట్ల స్పోర్టింగ్, సెరెమోనియల్ కిట్లను (Kits) చైనాకు చెందిన అపారెల్ బ్రాండ్ 'లి నింగ్' (Li Ning) స్పాన్సర్(Sponsor) చేస్తున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (Indian Olympic Association) ప్రకటించింది. ఆ ప్రకటన చేసే సమయంలో అక్కడే కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఉన్నారు. అయితే వారం రోజులు గడవక ముందే చైనా స్పాన్సర్‌ను తప్పించామని ఐవోయే అధ్యక్షుడు నరీందర్ బత్రా, ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అంతే కాకుండా భారత అథ్లెట్ల కిట్లను ఒక అపారెల్ సంస్థ స్పాన్సర్ చేస్తున్నదని.. అయితే దాని పేరు మాత్రం కిట్లుపై ముద్రించి ఉండవని వారు పేర్కొన్నారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. గత రెండేళ్లుగా ఇండియా-చైనా మధ్య సరిహద్దు వివాదం సడుస్తున్నది. గత ఏడాది గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులపై ఇండియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పలు చైనా యాప్‌లను కూడా భారత ప్రభుత్వం నిషేధించింది. ఐపీఎల్ స్పాన్సర్‌గా ఉన్న వివోను బీసీసీఐ గతేడాది తాత్కాలికంగా పక్కన పెట్టి డ్రీమ్11ను టైటిల్ స్పాన్సర్‌గా తీసుకొని వచ్చింది. చైనా సంస్థలు కూడా ఇండియాలో పలు క్రీడా ఒప్పందాలను తాత్కాలికంగా పక్కన పెట్టాయి.
ఇలాంటి సమయంలో ప్రపంచ క్రీడా మహోత్సవంగా పేర్కొనే ఒలింపిక్స్‌కు భారత జట్టు చైనా స్పాన్సర్ సహాయంతో వెళ్తున్నదన్న వార్త క్రీడాభిమానుల్లో ఆగ్రహాన్ని పెంచింది. విశ్వ క్రీడలకు వెళ్లే భారత అథ్లెట్లకు భారత కంపెనీలు స్పాన్సర్ చేయలేవా అని విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా కేంద్ర మంత్రి రిజిజు ఎదుటనే చైనా కంపెనీ స్పాన్సర్ చేస్తున్నదని ప్రకటించినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో వివాదం పెద్దది అవుతుందని గ్రహించిన ఐవోఏ వెంటనే ఒక ప్రకటన విడుదల చేసింది. 'దేశ ప్రజల మనోభావాలను గుర్తించి మేము ఇప్పుడు ఉన్న స్పాన్సర్‌ను తప్పించి వేరే కొత్త వారిని నియమించాము.' అని ప్రకటన విడుదల చేసింది. భారత అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, ఇతర అధికారులు బ్రాండ్ లేని దుస్తులు ధరించి ఒలింపిక్స్‌లో పాల్గొటారు అని అదే స్టేట్మెంట్‌లో పేర్కొన్నారు. అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ బ్రాండ్ ఏంటి? చైనీస్ కంపెనీయే పేరు లేకుండా దుస్తులు సరఫరా చేస్తున్నదా? అని ఐవోఏ అధ్యక్ష కార్యదర్శులను ప్రశ్నించగా వారు సమాధానం చెప్పడానికి నిరాకరించారు. 'ఆటగాళ్లు ధరించిన దుస్తులు ఏ బ్రాండ్, ఎవరు స్పాన్సర్ చేశారు వంటి ప్రశ్నలు తలెత్తవద్దనే వారి బట్టలను అన్‌బ్రాండెడ్‌గా ఉంచాము' అని ఐవోఏ సమాధానం చెప్పి తప్పించుకున్నది.
French Open 2021: చరిత్ర సృష్టించిన జిదాన్‌సెక్.. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌కి చేరింది ఎవరెవరంటే..!
భారత అథ్లెట్లు 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌కు వెళ్లినప్పుడు కూడా లి నింగ్ సంస్థే స్పాన్సర్‌గా వ్యవహరించింది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో ఈ చైనీస్ సంస్థే భారత అథ్లెట్లకు కిట్లు స్పాన్సర్ చేస్తున్నది. ఇండియాలోని చాలా మంది క్రీడాకారులకు ఈ సంస్థ కిట్లు అందిస్తున్నది. అయితే ఇండో-చైనా వివాదం నేపథ్యంలోనే ఈ సంస్థను తప్పించామని ఐవోఏ స్పష్టం చేసింది. కాగా, ఎన్నో ఏళ్లుగా డిజైనింగ్ నుంచి క్రీడాకారులకు అందించే వరకు లి నింగ్ పూర్తి బాధ్యతలు తీసుకున్నది. ఇప్పుడు హఠాత్తుగా ఎలాంటి టెండర్లు, ప్రకటనలు లేకుండానే స్పాన్సర్ మార్చేశాం అని ఐవోఏ ప్రకటించడంపై అనుమానాలు నెలకొన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics