క్రికెట్ బంతులు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఏ బంతి నాణ్యమైనది? టీమ్ ఇండియా ఉపయోగించే బంతులు ఏమిటి?

ఏ దేశంలో ఏ బ్రాండ్ బాల్స్ ఉపయోగిస్తారో తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు రకాల బంతులు ఉపయోగిస్తారు. కూకబుర్రా, డ్యూక్, ఎస్జీ బంతులు ఎక్కువగా ఏయే దేశాలు ఉపయోగిస్తాయి? ఎక్కడ ఈ బంతులు తయారు అవుతాయో ఈ కథనంలో తెలుసుకోండి.

 • Share this:
  ఇండియా, న్యూజీలాండ్ (India Vs New Zealand) మధ్య జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్ మైదానం వేదికగా వరల్డ్ టెస్ట్‌ చాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final) జరుగనున్నది. దీనికి సంబంధించిన నిబంధనలను ఐసీసీ గురువారం తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. కాగా ఈ మ్యాచ్‌లో గ్రేడ్ 1 డ్యూక్ బంతులను ఉపయోగించనున్నట్లు ఐసీసీ (ICC) ప్రకటించింది. ఐసీసీ నిబంధనలతో పాటు ఏ బ్రాండ్ బంతులు ఉపయోగించబోతున్నామో కూడా చెప్పడానికి ఒక కారణం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో డ్యూక్స్, కూకాబుర్రా, ఎస్జీ బంతులను ఉపయోగిస్తున్నారు. ఒక్కో దేశం తమకు అనుకూలమైన బంతులను మ్యాచ్‌ల కోసం వాడుతున్నాయి. అయితే ఈ బంతులు ఎంత బరువు ఉండాలి.. ఎంత చుట్టు కొలతలు కలిగి ఉండాలనే నిబంధనలు 1788లో మెరిల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) (MCC) రూపొందించింది. ఆయా దేశాలు ఏ క్రికెట్ బంతులు ఉపయోగించినా ఎంసీసీ నిబంధనల మేరకే బంతులు ఉంటాయి. ఏ క్రికెట్ బంతి అయినా 155.9 గ్రాముల నుంచి 163 గ్రాముల బరువు, 22.4 నుంచి 22.9 చుట్టు కొలత కలిగి ఉండాలి. ఈ నిబంధనలు అనుసరించే బంతులను తయారు చేస్తారు. బంతి, దానికి ఉండే సీమ్‌ను బట్టే దాని పని విధానం బయటపడుతుంది. క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం పెరుగుతుందని అందరూ అంటున్నా.. పిచ్, బంతి వంటివే ఆటలో కీలక పాత్ర పోషిస్తాయి.

  కూకబుర్రా : 1890 నుంచి కూకబుర్రా బ్రాండ్ బంతులను తయారు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 1 బంతులుగా కూకబుర్ర బంతులను పిలుస్తారు. ఈ క్రికెట్ బంతులు 128 ఏళ్ల నుంచి తయారీలో ఉన్నా తొలి సారిగా క్రికెట్ ఆస్ట్రేలియా 1946/47 యాషెస్ సిరీస్ కోసం ఉపయోగించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న కూకబుర్రా ఫ్యాక్టరీలో ఈ బంతులు తయారు అవుతాయి. ప్రపంచంలోనే అత్యుత్తమైన ముడి సరుకును ఉపయోగించి ఈ బంతులను మెషిన్ల ద్వారా తయారు చేస్తారు. నాలుగు భాగాలుగా ఉండే ఈ బంతి 156 గ్రాములు ఉంటుంది. ఈ బంతి ఎక్కువగా సీమ్ కలిగి ఉండదు. కానీ 30 ఓవర్ల వరకు స్వింగ్ అవుతూ బౌలర్లకు సహకరింస్తుంది. ప్రపంచంలో అత్యధిక టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్‌లకు కూకబుర్రా టర్ఫ్ బంతులనే ఉపయోగిస్తారు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులు కూకబుర్రా బంతులను ఉపయోగిస్తాయి.

  డ్యూక్ బంతులు : యునైటెడ్ కింగ్‌డమ్‌లోని టాన్‌బ్రిడ్జ్ ప్రాంతంలో 1760 నుంచి డ్యూక్ బంతులను తయారు చేస్తున్నారు. కూకబుర్రా బంతులతో పోల్చుకుంటే ఈ బంతులు ముదురు రంగులో ఉంటాయి. ఈ బంతులను పూర్తిగా చేతులతోనే తయారు చేస్తారు. అత్యంత నిపుణులైన వ్యక్తులు వీటిని తయారు చేయడంతో అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండటమే కాకుండా ఎక్కువ సమయం కొత్త బంతిలాగే కనపడుతుంది. మంచి సీమ్ కలిగి ఉండే ఈ బంతి 50 నుంచి 56 ఓవర్ల పాటు స్వింగ్‌ను అందిస్తుంది. ఇతర బంతులతో పోలిస్తే బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుంది. బౌలర్లకు ఈ బంతులు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ పిచ్‌లపై డ్యూక్ బంతులు బ్యాట్స్‌మాన్‌ను డామినేట్ చేస్తుంటాయి. ఈ బంతులను ఇంగ్లాండ్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు ఉపయోగిస్తుంటాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఇంగ్లాండ్‌లో జరుగుతున్నందున గ్రేడ్ 1 డ్యూక్స్ ఉపయోగించాలని ఐసీసీ నిర్ణయించింది.

  Olympics : సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతు.. అర్హత ప్రక్రియ ముగిసినట్లు ప్రకటన

  ఎస్జీ బంతులు : ఎస్జీకి పూర్తి నామం సన్స్‌పరిల్స్ గ్రీన్‌ల్యాండ్స్. ఈ సంస్థను 1931లో కేదార్‌నాథ్, ద్వారకానాథ్ ఆనంద్‌లు సియాల్ కోట్ (పాకిస్తాన్)లో ప్రారంభించారు. ఎస్జీ సంస్థ క్రీడలకు సంబంధించిన అన్ని రకాల సామాగ్రిని తయారు చేస్తుంది. అయితే స్వాతంత్రం అనంతరం ఎస్జీ సంస్థను సియాల్ కోట్ నుంచి ఇండియాలోని మీరట్‌కు తరలించారు. 1991లో బీసీసీఐ ఎస్జీ బంతులను టెస్ట్ క్రికెట్ కోసం ఉపయోగించాలని నిర్ణయించింది. ఆనాటి నుంచి ఇండియాలో జరిగే ప్రతీ టెస్ట్ మ్యాచ్‌లో ఎస్జీ బంతులనే ఉపయోగిస్తున్నారు. మిగతా బంతుల మాదిరిగా సన్నని దారం కాకుండా ఎస్జీ బంతుల తయారీలో టికర్ థ్రెడ్‌ను ఉపయోగిస్తారు. అందుకే ఈ బంతికి వెడల్పైన సీమ్ ఉంటుంది. ఈ బంతులన్నీ చేతితోనే తయారు చేస్తారు. అందుకే బంతి చాలా నాణ్యంగా ఉంటుంది. అయితే ఇండియాలో ఉండే పొడి వాతావరణం కారణంగా ఎస్జీ బంతులు త్వరగా మెరుపు కోల్పోతాయి. ఈ బంతులు స్పిన్నర్లకు ఎక్కువగా ఉపయోగపడతాయి. అయితే షైనింగ్ కోల్పోయినా ఈ బంతి 40 ఓవర్ల వరకు రివర్స్ స్వింగ్ చేయడంలో చక్కగా ఉపయోగపడతాయి. బీసీసీఐ మాత్రమే ఈ బంతులను ఉపయోగిస్తున్నది.
  Published by:John Naveen Kora
  First published: