హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : అర్జున్ టెండుల్కర్ భవిష్యత్ ఏంటి? ముంబై తరపున ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు ఆడతాడు?

IPL 2021 : అర్జున్ టెండుల్కర్ భవిష్యత్ ఏంటి? ముంబై తరపున ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు ఆడతాడు?

అర్జున్ టెండుల్కర్ అరంగేట్రం ఎప్పుడు?

అర్జున్ టెండుల్కర్ అరంగేట్రం ఎప్పుడు?

  ఐపీఎల్ 2021 (IPL 2021) మినీ వేలం ఫిబ్రవరిలో నిర్వహించినప్పుడు అర్జున్ టెండుల్కర్‌ను (Arjun Tendulkar) తొలి రౌండ్‌లో ఎవరూ కొనుగోలు చేయలేదు. రెండో రౌండ్‌లో మరోసారి అతడి కోసం ఆక్షన్ నిర్వహించగా ఎవరూ పాడలేదు.. చివరి క్షణంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ జహీర్ ఖాన్ చేయి ఎత్తాడు. ఆ తర్వాత కూడా ఎవరూ పాట పాడటానికి సాహసించలేదు. ఎందుకంటే అర్జున్ ముంబైకే సొంతం అని అందరూ భావించినట్లు ఉన్నారు. అలా రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌కే అర్జున్‌ను ముంబై సొంతం చేసుకుంది. గతంలో ముంబై ఇండియన్స్ నెట్ బౌలర్‌గా పని చేసిన అర్జున్ ఇప్పుడు అధికారికంగా ముంబై జట్టులో సభ్యుడయ్యాడు. ముంబై జట్టు ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఆడింది. లీగ్ దశలో ఇంకా 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. కానీ ఇప్పటి వరకు అర్జున్ టెండుల్కర్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఎడమ చేతి వాటం ఆల్‌రౌండర్ అయిన అర్జున్‌కు జట్టులో స్థానం కల్పించడం అంత ఆషామాషీ విషయం ఏమీ కాదు.

  ముంబై జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నారు. స్వదేశీ, విదేశీ క్రీడాకారులతో జట్టు చాలా పటిష్టంగా ఉన్నది. టీమ్ ఇండియాలో ఆడే క్రికెటర్లతో పాటు పలు అంతర్జాతీయ జట్లకు చెందిన ఆటగాళ్లతో నిండిపోయింది. మంచి సమతూకంతో ఉన్న జట్టులోకి యువకుడైన అర్జున్ టెండుల్కర్‌కు చోటు కల్పించడం కష్టమేనని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఒకవేళ ముంబై ఇండియన్స్ వరుస విజయాలు సాధించి పటిష్టంగా ఉన్నట్లయితే ఒక మ్యాచ్‌లో ఆడించి ఉండే వారేమో.. కానీ ముంబై ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించి మూడింటిలో ఓడిపోయింది. ఇలాగే పరాజయాలు మూట గట్టుకుంటే జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు కష్టంగా మారతాయి. ఇలాంటి సమయంలో అర్జున్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం లేదు.


  అయితే అర్జున్ టెండుల్కర్ జట్టుతో ఉండటం వల్ల పలు విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. దిగ్గజ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం వల్ల టెండుల్కర్ పలు విషయాలు తెలుసుకుంటాడు. నాన్న సచిన్ టెండుల్కర్ నుంచి తెలుసుకున్న విషయాల కంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు జరిగే చర్చల వల్ల మరింత పరిజ్ఞానం వస్తుంది. అందుకే అర్జున్‌ను తుది జట్టులోకి తీసుకోకపోయినా సచిన్ పెద్దగా ఒత్తిడి చేయడనే చర్చ జరుగుతున్నది. కరోనా కారణంగా సచిన్ ఈ ఏడాది ముంబై జట్టుతో కలసి లేడు. లేకపోతే ప్రతీ ఏడాది జట్టు మెంటార్‌గా వెంటే ఉండే వాడు. అప్పుడు ఏమైనా అవకాశాలు వచ్చేవేమో. ఏదేమైనా అర్జున్ టెండుల్కర్‌కు ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశాలు అంతగా లేవని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

  Published by:John Naveen Kora
  First published:

  Tags: Arjun Tendulkar, Cricket, IPL 2021, Mumbai Indians

  ఉత్తమ కథలు