టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత్ బోణీ కొట్టింది. మహిళా వెయిట్ లిఫ్టర్ (Weight Lifter) మీరాబాయ్ చాను రజత పతకం (Silver medal) గెలిచింది. శనివారం జరిగిన మెడల్ ఈవెంట్లో చాను 49 కేజీల విభాగంలో 115 కేజీల క్లీన్ జర్క్ ఇచ్చి పతకాన్ని ఎగరేసుకొని పోయింది. అంతకు ముందు స్నాచ్‌లో 87 కేజీలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోల బరువు ఎత్తిన చాను భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. కాగా, చైనాకు చెందిన హూ ఝిహూయ్ స్వర్ణ పతకం గెలవగా.. ఇండోనేషియాకు కాంస్య పతకం లభించింది. భారత జట్టు ఒలింపిక్స్ ప్రెడిక్షన్స్‌లో క్రీడా విశ్లేషకులు అందరూ మొదటి నుంచి చాను పతకం గెలుస్తుందని అంచనా వేశారు. అందరి అంచనాలను అందుకుంటూ చాను రజత పతకం గెలిచింది. క్లీన్ అండ్ జర్క్‌లో చాను ఈ ఏడాది 119 కేజీలు ఎత్తి వరల్డ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి సారి పాల్గొన్న చాను స్నాచ్ రౌండ్లో సరైన బరువులు ఎత్తలేక పతకానికి దూరమైంది. గత నాలుగేళ్లుగా మెరుగైన ప్రదర్శన చేస్తున్న చాను ఒలింపిక్స్‌లో రెండో సారి పాల్గొని రజతాన్ని కొల్లగొట్టింది.
2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి తొలి సారిగా వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని గెలిచింది. మహిళల 69 కేజీల విభాగంలో ఆమె పతకం కొల్లగొట్టింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో చాను రజత పతకాన్ని ఎగరేసుకొని పోవడం విశేషం. భారత ఒలింపిక్ చరిత్రలో వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని గెలిచిన తొలి క్రీడాకారిణిగా చాను రికార్డు సృష్టించింది.
చాను పతకం గెలవడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. 'టోక్యో ఒలింపిక్స్‌లో ఇంత కంటే ఆనందకరమైన ప్రారంభం ఉండదు. తన అద్భుత ప్రతిభతో సిల్వర్ మెడల్ గెలిచిన చానును అభినందిస్తున్నాను. తన విజయం ప్రతీ భారతీయుడికి స్పూర్తిని నింపాలి' అని ట్వీట్ చేశారు
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.