క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ అద్భుతమైన వీడియో పంచుకున్నాడు. ఎక్కడికి వెళ్లాడో వివరాలు తెలియకుండా జాగ్రత్తపడిన లిటిల్‌మాస్టర్ పారా సెయిలింగ్ చేస్తూ గాల్లో విహరించాడు. దానికి ‘హమ్‌తో ఉడ్ గయే’ అనే బాలీవుడ్ పాటను జత చేశాడు. కరోనా పరిస్థితుల కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచీ ఇంటికే పరిమితమైన సచిన్ ఇటీవలే బయటకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన క్రికెట్ స్నేహితులతో కలిసి గోల్ఫ్ ఆడుతున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పంచుకొని అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా పారా సెయిలింగ్ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
సచిన్ 1989లో 16 ఏళ్ల వయసులోనే పాకిస్థాన్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌ను తన భుజాలపై మోసి ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా సత్తా చాటాడు.
2011లో తన చిరకాల కోరికగా మిగిలిపోయిన వన్డే ప్రపంచకప్‌ను సాధించి 2013లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు మాస్టర్ బ్లాస్టర్.
Published by:Sridhar Reddy
First published:December 08, 2020, 16:26 IST