IPL 2021 : తొలి మ్యాచ్ ఓటమిపై వార్నర్ వింత కారణం.. కేన్ మామ ఎక్కడంటూ ఫ్యాన్స్ ఫైర్

ఓటమికి వార్నర్ చెప్పిన కారణం ఏంటో తెలుసా? [PC: iplt20.com]

 • Share this:
  ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఓటమితో ప్రారంభించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో (Kolkata Knight Riders) చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి మరీ ఫీల్డింగ్ ఎంచుకున్నందుకు వార్నర్ సేన భారీ మూల్యం చెల్లించుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఓపెనర్లు విఫలం కావడం, బెయిర్‌స్టో అవుటయ్యాక పరుగుల వేగం తగ్గడంతో ఓటమి తప్పలేదు. అయితే తమ ఓటమికి కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) మాత్రం వింత కారణం చెబుతున్నాడు. కేకేఆర్ జట్టులో పొడవైన బౌలర్లు ఉండటం వల్ల పరుగులు చేయలేకపోయామని చెప్పాడు. 'ఆ జట్టులోని పొడవైన బౌలర్లు మమ్మల్ని క్రాస్ సీమ్ బంతులతో అడ్డుకున్నారు. అందుకే మేము పరుగులు చేయలేకపోయాము' అని చెప్పుకొచ్చాడు. డేవిడ్ వార్నర్ చెప్పిన పొడవైన బౌలర్లు పాట్ కమ్మిన్స్, ప్రసిధ్ కృష్ణ. వీరిలో పాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియాకు చెందిన బౌలరే. వార్నర్ కూడా ఎన్నోసార్లు అతడి బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసి ఉంటాడు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఆడిన మనీష్ పాండే, విజయ్ శంకర్‌లకు క్రాస్ సీమ్ బంతులు ఆడటం పెద్ద కష్టమేమీ కాదు. తేమ ప్రభావం చూపించడం కరక్టే కానీ.. క్రాస్ సీమ్ బంతుల వల్లే ఆడలేకపోయాము అనేది ఒక కెప్టెన్ చేయాల్సిన వ్యాఖ్య కాదని విశ్లేషకులు అంటున్నారు.

  మరోవైపు తొలి మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ జట్టు కూర్పే సరిగా లేదని మాజీ క్రికెటర్లు అంటున్నారు. వెటరన్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ చూసి పెదవి విరిచాడు. నెంబర్ 4 పొజిషన్‌లో కేన్ విలియమ్‌సన్ సరైన ఛాయిస్ అని చెప్పాడు. ఓపెనర్లుగా వార్నర్, బెయిర్‌స్టో వచ్చి ఎదురు దాడికి దిగితే కేకేఆర్ బౌలర్లు కూడా ఆత్మరక్షణలో పడేవారు. కానీ వృద్దిమాన్ సాహను తీసుకోవడంతో అతడు తడబడ్డాడు. వార్నర్ కూడా తన వికెట్‌ను నిర్లక్ష్యంగా పారేసుకోవడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఈ సమయంలో జానీకి తోడుగా కేన్ విలియమ్‌సన్ ఉండుంటే పరుగుల వేగం పెరిగేదని నిపుణులు అంటున్నారు. బెయిర్‌స్టో వేగంగా ఆడినా మరో ఎండ్‌లో మనీష్ పాండే కుదురుకోవడానికి కొంచెం సమయం తీసుకున్నాడు. దీంతో జానీపై ఒత్తిడి పెరిగిపోయింది. అదే కేన్ ఉండుంటే పరిస్థితులకు తగ్గట్లు వేగం పెంచే వాడని అంటున్నారు. విలియమ్‌సన్‌ను డగౌట్‌కు పరిమితం చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  ఇక ఆదివారం మ్యాచ్‌లో మహ్మద్ నబీ, విజయ్ శంకర్‌ల కంటే ముందు అబ్దుల్ సమద్‌ను పంపించాల్సిందనే వాదన కూడా వస్తున్నది. అబ్దుల్ సమద్‌కు మంచి స్ట్రైక్ రేట్ ఉన్నది. ఎలాంటి బౌలర్‌ను అయినా ఆడగలిగే టాలెంట్ ఉన్న క్రికెటర్. గతంలో కూడా సన్‌రైజర్స్ తరపున మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో చివర్లో చెలరేగినా బంతులు లేకపోవడంతో అతడు కూడా ఏమీ చేయలేకపోయాడు. మొత్తానికి ఎస్ఆర్‌హెచ్ తొలి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకొని తర్వాత మ్యాచ్‌లో గెలుపు బాట పడుతుందేమో చూడాలి.
  Published by:John Naveen Kora
  First published: