VIRENDER SEHWAG CREATES HISTORY ON THIS DAY YEAR 2004 TO SCORE A TRIPLE HUNDRED AGAINST PAKISTAN SRD
Virender Sehwag : సుల్తాన్ ఆఫ్ ముల్తాన్.. వీరేంద్రుడి విధ్వంసానికి సరిగ్గా 17 ఏళ్లు..
Photo Credit : BCCI Twitter
Virender Sehwag : వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అంటేనే విధ్వంసానికి పెట్టింది పేరు. తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డుల్ని తిరగరాశాడు ఈ నవాబ్ ఆఫ్ నజఫగడ్. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజు భారత టెస్ట్ క్రికెట్ లో ఓ అద్భుతాన్ని సృష్టించాడు వీరేంద్రుడు.
వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అంటేనే విధ్వంసానికి పెట్టింది పేరు. బరిలోకి దిగాడంటే చాలు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఫామ్‌లో ఉంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ బౌలర్లను మానసికంగా దెబ్బతీసేవాడు. తన బ్యాటింగ్ తో ఎన్నో రికార్డుల్ని తిరగరాశాడు ఈ నవాబ్ ఆఫ్ నజఫగడ్. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజు భారత టెస్ట్ క్రికెట్ లో ఓ అద్భుతాన్ని సృష్టించాడు వీరేంద్రుడు. అప్పటివరకు టీమిండియాలో ఎవ్వరికి సాధ్యం కానీ అరుదైన ఘనతను సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో టీమిండియా తరఫున తొలి ట్రిపుల్ సాధించిన ప్లేయర్ గా అద్భుత రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ప్రపంచ టెస్ట్ క్రికెట్ లోనే అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని సాధించిన ప్లేయర్ గా అవతరించాడు. ఈ ఘనతను కూడా దాయాదీ పాకిస్ధాన్ (Pakisthan) పై సాధించడం మరీ విశేషం. 2004 పాకిస్థాన్ పర్యటనలో ముల్తాన్ టెస్ట్ లో ఈ ఫీట్ ను సాధించాడు సెహ్వాగ్. మొత్తం 531 నిమిషాలు క్రీజ్‌లో ఉన్న సెహ్వాగ్.. 375 బంతులెదుర్కుని 309 పరుగులు సాధించాడు. అందులో 39 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. షోయబ్ అక్తర్ (Shoiab Akthar) ,సక్లైన్ ముస్తాక్, సమీ, రజాక్ వేసిన బంతులను చితకబాదుతూ.. మైదానంలో వీరూ విశ్వరూపం చూపించాడు. ట్రిపుల్ సెంచరీని సిక్సర్‌తో సాధించడం ఈ ఇన్నింగ్స్‌కే హైలైట్. ఫలితంగా అప్పటి వరకు వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) పేరిట ఉన్న అత్యధిక పరుగుల (281) రికార్డు బద్దలయింది.
ఇక 82.40 స్ట్రైక్‌రేట్‌తో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్ గుర్తింపు పొందాడు. ఈ డాషింగ్ ఓపెనర్ మెరుపు బ్యాటింగ్‌తో భారత్ రెండురోజుల్లోనే 650 పరుగులు చేసింది. మిగతా రెండురోజుల్లో పాక్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. ఇక ఈ మ్యాచ్ లో సచిన్ (Sachin Tendulkar) కూడా 194 పరుగులతో అలరించాడు.
అయితే, సచిన్ డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్ ద్రావిడ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ ను చేశాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. సచిన్.. తన కన్న ముందు 5 డబుల్ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్ డిక్లర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్‌కు ముందే చెప్పానని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్ తన బయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే లో ప్రస్తావించాడు. ఈ వ్యవహారంలో ద్రవిడ్ తప్పులేదని, ముందే తనకు సూచించాడని స్పష్టం చేశాడు. ఇక, సెహ్వాగ్ తన కెరీర్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. సెహ్వాగ్ తర్వాత కరుణ్ నాయర్ ఇంగ్లండ్ పై ట్రిపుల్ సెంచరీ బాదిన టీమిండియా బ్యాట్స్ మన్ గా చరిత్రలో నిలిచాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.