హోమ్ /వార్తలు /క్రీడలు /

INDvENG: లార్డ్స్ గొడవ.. ఇంగ్లాండ్ ఆటగాళ్ల గాయాలపై మీడియా ప్రశ్నలు.. ఫైర్ అయిన కోహ్లీ

INDvENG: లార్డ్స్ గొడవ.. ఇంగ్లాండ్ ఆటగాళ్ల గాయాలపై మీడియా ప్రశ్నలు.. ఫైర్ అయిన కోహ్లీ

లీడ్స్‌లో జరుగనున్న మూడో టెస్టుపై విరాట్ కోహ్లీ ఏం చెప్పాడంటే.. (PC: Twitter/BCCI)

లీడ్స్‌లో జరుగనున్న మూడో టెస్టుపై విరాట్ కోహ్లీ ఏం చెప్పాడంటే.. (PC: Twitter/BCCI)

ఇంగ్లాండ్ జట్టుతో మూడ టెస్టు బుధవారం నుంచి లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా ప్రారంభం కానున్నది. మ్యాచ్‌కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు జవాబిచ్చారు.

ఇంగ్లాండ్ పర్యటనలో (England Tour) ఉన్న భారత జట్టు (Team India) లార్డ్స్ వేదికగా (The Lord's) చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. పూర్తి ఆత్మవిశ్వాసంతో కనపడుతున్న భారత జట్టు బుధవారం నుంచి లీడ్స్‌లోని (Leeds) హెడింగ్లే మైదానంలో మూడో టెస్టు ఆడబోతున్నది. భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నా.. తుది జట్టులో ఒకటో రెండో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వెడులుడుతున్నాయి. ఇక లార్డ్స్ వేదికగా ఇరు జట్ల మధ్య మాటల యుద్దం కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా బుమ్రా, అండర్సన్, కోహ్లీ, బట్లర్ మధ్య జరిగిన సంభాషణ టెస్టులో వేడిని పుట్టించింది. తప్పు ఎవరిదైనా ఇరు జట్లు ఒకరిని ఒకరు కవ్వించుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు కవ్వింపుల కారణంగానే మేము మరింత పట్టుదలగా ఆడి విజయం సాధించామని రెండవ టెస్టు ముగిసిన అనంతరం కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. కాగా, ఇక ఇప్పుడు కీలకమైన మూడో టెస్టులో భారత జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనున్నది. మ్యాచ్‌కు ముందు జరిగే మీడియా (Media Meet) సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పాల్గొని పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు. లార్డ్స్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మాటల యుద్దం, ఇంగ్లాండ్ ఆటగాళ్ల గాయాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు కోహ్లీ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకు అక్కడ సమావేశంలో ఏం జరిగింది?

మీడియా: ఇంగ్లాండ్ జట్టులో కీలకమైన ఆటగాళ్లు గాయాలతో తప్పుకున్నారు. ఇది మీకు అనుకూలమని అనుకుంటున్నారా? విజయం సాధించి సిరీస్‌లో మరింత ముందుకు వెళ్తారా?

కోహ్లీ: మా విజయాలు ప్రత్యర్థి జట్టు బలహీనతపై ఆధారపడి ఉన్నాయా? ఇంగ్లాండ్ జట్టులో అందరు ఆటగాళ్లు ఆడినా మేము వారిని ఓడించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము. ఇంగ్లాండ్ ఆటగాళ్లు గాయపడి ఆ జట్టు బలహీన పడాలని మేం కోరుకోము. ఇది నిజంగా మీరు అడగాల్సిన సరైన ప్రశ్న కాదు. గత కొన్నాళ్లుగా మంచి క్రికెట్ ఆడుతున్న జట్టును ఇలాంటి ప్రశ్న వేయడం గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి. (కోహ్లీ అసహనం).. మేం గత కొన్నేళ్లుగా ఇదే జట్టుతో ఆడుతూ విజయాలు సాధించాం. మేం ఎదుటి జట్టు బలహీనపడి సిరీస్ విజయాలు సాధించాలనే దృక్పదంతో ఎప్పుడూ లేము.

మీడియా: లార్డ్స్ విజయం మీకు ఎలా అనిపించింది.?

కోహ్లీ: తొలి టెస్టులో 5వ రోజు జరగక పోవడం మాకు చాలా నిరాశపరిచింది. మా చేతిలో 9 వికెట్లు ఉండి.. 150 పరుగులు ఛేదించాల్సి ఉన్నది. మేం విజయంపై చాలా నమ్మకంతో ఉన్నాము. కానీ వర్షం మా ఆశలపై నీళ్లు చల్లింది. కానీ లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో కూడా అదే విధమైన పరిస్థితులు వచ్చాయి. చివరి రోజు వారిని ఆలౌట్ చేస్తే విజయం దక్కుతుంది. నిజంగా లార్డ్స్‌లో 5వ రోజు మా జట్టు ఆడిన తీరుకు గర్వపడుతున్నాను. తొలి టెస్టు నిరుత్సాహపరిచినా.. రెండో టెస్టు విజయం మాకు సంపూర్ణ తృప్తిని ఇచ్చింది. ఇది నిజంగా అద్బుత విజయం.

మీడియా: భారత జట్టు ఇదే విన్నింగ్ కాంబినేషన్ కొనసాగిస్తుందా?

కోహ్లీ: రెండో టెస్టులో విజయం సాధించిన జట్టులో మార్పులు చేయడానికి నాకు ఎలాంటి కారణం కనిపించడం లేదు. బయట ఎంతో మంది ఎన్నో వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ రెండో టెస్టు ముగిసిన దగ్గర నుంచి ఆ వ్యాఖ్యలను మేం పట్టించుకోలేదు. ఒక విజయవంతమైన జట్టును డిస్ట్రబ్ చేయడం ఎవరికీ ఇష్టం ఉండదు. లార్డ్స్ వంటి మైదానంలో అద్బుత విజయం సాధించిన తర్వాత ఆటగాళ్లు మరింత ఉత్సాహంగా ఉన్నారు. మరోసారి మైదానంలోకి వచ్చి అదే స్పూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నారు.

మీడియా: అశ్విన్‌కు మూడో టెస్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయా? ఓపెనర్ల ఫామ్ ఎంత ముఖ్యం?

కోహ్లీ: ఈ సిరీస్‌లో భారత జట్టు ఓపెనర్లు ఆడిన తీరు నిజంగా అద్బుతం. కేఎల్ రాహుల్, రోహిత్ వర్మ ఓపెనర్లుగా మంచి పునాది వేశారు. మేము విదేశాల్లో ఆడే సమయంలో ఓపెనర్ల రాణించడం చాలా అవసరం. రాహుల్, రోహిత్ ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. వీళ్లు మంచి భాగస్వామ్యం అందించడం వల్లే తర్వాత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తగ్గుతున్నది. రెండో టెస్టులో వీరిద్దరు ఆడిన తీరువల్లే ప్రత్యర్థిపై మేము బలమైన ఒత్తిడి తేగలిగాము. ఇక అశ్విన్ గురించి చెప్పాలంటే.. హెడింగ్లేలో ఉన్న పిచ్ చూసి చాలా ఆశ్చర్యపోయాము. ఇలాంటి పిచ్ ఉంటుందని అసలు ఊహించలేదు. లార్డ్స్ లాగా ఎక్కువ పచ్చికను ఊహించాము. కానీ ఇది ఉపఖండం పిచ్‌ను పోలి ఉన్నది. ఇప్పటికే 12 మందిని ఎంపిక చేశాము. చూద్దాం రేపు మ్యాచ్ ముందు ఏం జరుగుతుందో.

మీడియా: రెండో టెస్టులో జో రూట్ తీసుకున్న నిర్ణయాలపై మీ స్పందన?

కోహ్లీ: ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలు, నిర్ణయాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఏ దశలో అయినా మన ప్రణాళికలో తప్పులు జరగవచ్చు. అయినంత మాత్రాన మనం ఒత్తిడిలో పడిపోయామని అనుకోవద్దు. ఒక కెప్టెన్ ఎప్పుడైనా జట్టు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాననే అనుకుంటాడు. జో రూట్ ఆ సమయంలో అలాగే అనుకొని నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే మనం జట్టుకు మంచి చేయాలనే అనుకుంటాము కానీ చెడు మాత్రం చేయముగా. మీరు అంగీకరించండి లేదా అంగీకరించకపోండి.. నేను ఒకటే చెబుతున్నాను. ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అతడికి కరెక్టే. ఇది కెప్టెన్ల బాధ్యత అంతే.

మీడియా: లార్డ్స్‌లో మిమ్మల్ని రెచ్చగొట్టింది ఎవరు?

కోహ్లీ: నేను ఇప్పుడు అక్కడ ఏం జరిగింతో అన్నీ పూర్తిగా వివరించలేను. అది అక్కడ ఉన్న కెమేరాలు, స్టంప్ మైకులు క్యాచ్ చేయాల్సిన విషయం. ఇరు జట్లు ఒకేలా స్పందించాయి. మైదానంలో ఏం జరిగిందో అది ఆ సమయంలో జరిగిన విషయమే కానీ.. లార్డ్స్‌లో జరిగిన దాన్ని అక్కడికే పరిమితం చేయాలి. ఇలాంటివి జరిగినప్పుడు జట్టులో ఒకలాంటి ఐకమత్యం ఏర్పడుతుంది. మరింత కసిగా ఆడాలని అనిపిస్తుంది. ఇదంతా ఒక క్రీడా వాతావరణంలోనే జరిగిందే కానీ వ్యక్తిగతంగా కాదు. అక్కడిది అక్కడితో మర్చిపోవాల్సిందే. ఇది కొత్త టెస్టు.. దీన్ని ఎలా గెలవాలనే మేము దృష్టిసారించాము.

మీడియా: క్రికెట్ చరిత్రలో మీరు ఒక ముఖ్యమైన మైలు రాయి దాటినప్పుడు ఎలా అనిపిస్తుంది?

కోహ్లీ: నేను చరిత్ర గురించి పెద్దగా ఆలోచించే వ్యక్తిని కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో మాత్రమే నాకు అవసరం. మాకు తెలుసు మేం ఎలా ఆడుతున్నాము.. ఎలా ముందుకు పోతున్నామో. చరిత్రలో ఎన్నో జరుగుతుంటాయి. కానీ అవన్నీ ఎప్పటికీ నిలిచి ఉంటాయని నేను భావించను. రికార్డులు అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి.

మీడియా: ఇంగ్లాండ్‌ మైదానాల్లో బ్యాట్స్‌మెన్ ఇబ్బందుల గురించి ఏమంటారు?

కోహ్లీ: ఇంగ్లాండ్ గడ్డపై ఆడుతున్నప్పుడు మనం ఎప్పుడూ రిలాక్స్ అవకూడదు. ముందుగా మన గర్వాన్ని అణగదొక్కుకొని ఆడుతుండాలి. ఇక్కడి పిచ్‌పై 30 లేదా 40 పరుగులు చేసిన తర్వాత కూడా బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కానీ మనం ఓపికతో ఎదురు చూడాలి. ఇక్కడ స్కిల్‌తో పాటు మానసిక ధృఢత్వం కూడా అవసరమే. మనం చిన్న తప్పు చూసినా అక్కడితో ఆగిపోయినట్లే. వ్యక్తిగతంగా చెప్పాలంటే.. ఇంగ్లాండ్‌లో పరిస్థితులు బ్యాటింగ్‌కు చాలా ప్రతికూలంగా ఉంటాయి.

First published:

Tags: India vs england, Team India, Test Cricket, Virat kohli

ఉత్తమ కథలు