Home /News /sports /

VIRAT KOHLI COMPLAINS TO UMPIRE AFTER ENGLAND OPENER HASEEB HAMEED MARKS GUARD OUTSIDE POPPING CREASE JNK

INDvsENG: ఇంగ్లాండ్ క్రికెటర్‌పై అంపైర్‌కు పిర్యాదు చేసిన విరాట్ కోహ్లీ.. ఎందుకో తెలుసా?

అంపైర్‌తో కోహ్లీ వాగ్వివాదం.. ఎందుకంటే.. (PC: Sony TV Grab)

అంపైర్‌తో కోహ్లీ వాగ్వివాదం.. ఎందుకంటే.. (PC: Sony TV Grab)

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ ఓపెనర్ హమీద్‌పై అంపైర్లకు పిర్యాదు చేశాడు. పాపింగ్ క్రీజ్ వెలుపల అతడు గార్డ్ తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

    ఓవల్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ (India Vs England) జట్ల మధ్య నాలుగో టెస్టు (4th Test) జరుగుతున్నది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు (Team India) 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ (England) కేవలం 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో జరిగిన ఒక ఘటన వివాదంగా మారింది. ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్ హసీబ్ హమీద్ క్రీజు బయట ఉన్న ప్రదేశంలో గార్డు తీసుకున్నాడు. అక్కడ కాలితో మార్క్ చేశాడు. అతడు చేసిన పనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వెంటనే అంపైర్‌కు పిర్యాదు చేశాడు. పాపింగ్ క్రీజు బయట ఎలా గార్డు తీసుకుంటాడని.. అది పిచ్‌ను పాడుచేయడం కిందకే వస్తుందని వాదించాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌తో ఈ విషయంపై కోహ్లీ సుదీర్ఘంగా వాదన పెట్టుకున్నాడు. ఈ సంఘటన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే జరిగింది.

    పాపింగ్ క్రీజు వెలుపల తన స్పైకింగ్ షూస్‌తో హమీద్ గార్డు తీసుకోవడానికి కోహ్లీ తీవ్రంగా వ్యతిరేకించాడు. సాధారణంగా పాపింగ్ క్రీజ్ లోపల బ్యాట్ లేదా షూస్‌తో గార్డును మార్కు చేస్తుంటారు. కొంత మంది బెయిల్స్ తీసుకొని అక్కడ మార్క్ చేస్తుంటారు. కానీ పాపింగ్ క్రీజ్ వెలుపల డేంజర్ జోన్‌లో గార్డు చేయడాన్ని కోహ్లీ తీవ్రంగా వ్యతిరేకించాడు. మూడో టెస్టులో రిషబ్ పంత్ పాపింగ్ క్రీజ్ వెలుపల నిలబడి బ్యాటింగ్ చేయడాన్ని అంపైర్ నిరాకరించాడు. డేంజర్ జోన్‌లో నిలబడి బ్యాటింగ్ చేయవద్దని వారించాడు. దీంతో పంత్ గార్డు మార్చుకొని క్రీజులోనే నిలబడి తర్వాతి బంతికే అవుటయ్యాడు. అంపైర్ తనను వారించడం వల్లే అవుటయ్యానని రిషబ్ పంత్ కూడా అప్పుడు చెప్పుకొచ్చాడు. అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మాన్ హమీద్ బయట గార్డు మార్క్ చేసిన అంపైర్లు పట్టించుకోక పోవడం వల్లే కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.





    కాగా, హసీబ్ హమీద్ గార్డు విషయంలో కామెంట్రీ బాక్సులో కూడా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కామెంటేటర్లు హర్షా భోగ్లే, అజయ్ జడేజా ఈ విషయంలో తమ వాదనలు వినిపించారు. క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక బ్యాట్స్‌మాన్ తన గార్డును పాపింగ్ క్రీజ్ వద్ద తీసుకోవడానికి అనుమతి ఇస్తుంది. పాపింగ్ క్రీజు నుంచి ఐదు అడుగుల దూరంలో ఉన్న ప్రదేశాన్ని డేంజర్ లేదా ప్రొటెక్టెడ్ ఏరియా అని పిలుస్తారు. అక్కడ మాత్రం మార్క్ చేయవద్దని నిబంధనలు చెబుతుంటాయి. ఎంసీసీ రూల్ నెంబర్ 41.15.1 ప్రకారం బ్యాట్స్‌మాన్ ప్రొటెక్టెడ్ ప్రదేశంలో, దానికి సమీపంలో ఎలాంటి మార్కులు వేయకూడదు. అలా చేస్తే అతడిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. కాగా, హమీద్ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని అంపైర్లు భావించారు. అతను డేంజర్ జోన్ సమీపంలోకి వెళ్లలేదని అంపైర్లు అనుకోవడం వల్లే ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదని తెలుస్తున్నది. కాగా, హమీద్ ఆ తర్వాత కొద్ది సేపటికే జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో అవుటవడం గమనార్హం.

    Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. హై జంప్‌లో రజతం సాధించిన ప్రవీణ్ కుమార్



    Published by:John Naveen Kora
    First published:

    Tags: India vs england, Team india, Test Cricket, Virat kohli

    తదుపరి వార్తలు