భారత రెజ్లర్ (Indian Wrestler) వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) తన అభిమానులకు షాకిచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) పేలవ ప్రదర్శన, ఒలింపిక్ విలేజ్‌లో తోటి రెజ్లర్లతో వివాదం, వినేశ్ ఫొగట్‌పై రెజ్లింగ్ సంఘం సస్పెన్షన్ విధించడం వంటి పరిణామాలు ఆమెను చాలా నిరాశలో పడేశాయి. తాను ఇకపై రెజ్లింగ్ ఆడతానో లేదో అని అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా.. తన మనసు ముక్కలై పోయిందని (Heart Broken).. ఇక అంతా అయిపోయిందని నైరాశ్యంలో మునిగిపోయింది. ఇండియాకు తిరిగి వచ్చిన వినేశ్ ఫొగట్ ఒక జాతీయ పత్రికతో మాట్లాడుతూ అనేక ఆరోపణలు చేసింది. ఇండియాలో ఎంత త్వరగా పైకి ఎదుగుతామో.. అంతే త్వరగా కిందకు పడిపోతాం. ఇక్కడ పరిస్థితులే అలా ఉంటాయి. ఇప్పటి వరకు ఒక్క పతకం కూడా సాధించలేకపోయాను. నా కెరీర్ అంతా ముగిసిపోయింది. అసలు ఇకపై ఏం జరుగుతుందో అర్దం కావడం లేదని వాపోయింది. తాను తిరిగి మ్యాట్ పైకి ఎప్పుడు వెళ్తానో.. అసలు వెళ్తానో లేదో కూడా తనకు తెలియదని ఫొగట్ అనుమానం వ్యక్తం చేసింది. నా కాలు విరగలేదు.. అది బాగానే ఉంది. కానీ నా మనసు ముక్కలై పోయిందని ఫొగట్ ఆవేదన వ్యక్తం చేసింది.
2017లో తలకు గాయం అయిన దగ్గర నుంచి తన ప్రదర్శన సరిగా లేదని వినేశ్ చెప్ప్పింది. టోక్యో ఒలింపిక్స్ సన్నద్ద సమయంలోతాను రెండు సార్లు కరోనా బారిన పడ్డట్లు ఆమె చెప్పింది. అంతే కాకుండా తాను మానసిక సమస్యలతో కూడా చాలా ఇబ్బంది పడ్డానని రెజ్లర్ చెప్పుకొచ్చింది. ఇవన్నీ టోక్యో ఒలింపిక్స్‌లో ప్రదర్శనపై ప్రభావితం చేసినట్లు వినేశ్ ఫొగట్ వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వినేశ్ బెలారస్‌కు చెందిన వెనెసా చేతితో ఓటమి పాలైంది. క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడిపోయి ఖాళీ చేతులతో ఇండియాకు తిరిగి వచ్చింది. టాప్స్‌లో భాగంగా వినేశ్ ఫొగట్ కోసం భారత ప్రభుత్వం చాలా ఖర్చు చేసింది. ఆమెకు విదేశాల్లో కోచింగ్ ఇప్పించింది. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం ఆమె నిరాశాకరమైన ప్రదర్శన చేసింది.
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 6, 2021
ఇక టోక్యో ఒలింపిక్ విలేజ్ కోసం వెళ్లిన వినేశ్ ఫొగట్ ప్రవర్తనపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తాత్కాలిక నిశేధం కూడా విధించింది. ఆమెకు క్రీడా గ్రామంలో కేటాయించిన గదుల్లో ఇతర రెజ్లర్లతో కలసి ఉండటానికి, వారితోప్రాక్టీస్ చేయడానికి నిరాకరించింది. తాను వారితో కలసి ప్రాక్టీస్ చేస్తే కరోనా వచ్చే అవకాశం ఉందంటూ ఆరోపించింది. అంతే కాకుండా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు స్పాన్సర్లు ఇచ్చిన కిట్లను కూడా దరించకుండా.. సొంత దుస్తులు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఇలా వరుస పరిణామాలతో కుంగిపోయిన వినేశ్ ఫొగట్ ఆటకు దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఆమె శారీరికంగానే కాకుండా మానసికంగా కూడా కోలుకోవల్సిన అవసరం ఉందని సన్నిహితులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics, Wrestling