Home /News /sports /

Novak Djokovic : చరిత్ర సృష్టించడానికి రెండు అడుగులే... అరుదైన రికార్డుకు చేరువైన జకోవిచ్..

Novak Djokovic : చరిత్ర సృష్టించడానికి రెండు అడుగులే... అరుదైన రికార్డుకు చేరువైన జకోవిచ్..

జకోవిచ్ (Twitter)

జకోవిచ్ (Twitter)

Novak Djokovic : జకోవిచ్, బెరెటిని మధ్య జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌ హోరాహోరీగా మొదలైంది. పది గేమ్‌ల దాకా ఇద్దరు సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 5-5తో సమంగా నిలిచారు.

    ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) తన ‘క్యాలెండర్ స్లామ్’ కలకి మరింత దగ్గరయ్యాడు. ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌(US Open 2021 Latest Telugu News)లో జకోవిచ్ మరోసారి సెమీ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. దీంతో పాటు అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన టెన్నిస్‌ ఆటగాడిగా చరిత్ర సృష్టించడానికి వరల్డ్ నంబర్‌వన్‌ నొవాక్ జకోవిచ్‌కు కావాల్సింది మరో రెండు విజయాలే. 21వ టైటిల్‌పై కన్నేసిన ఈ సెర్బియా యోధుడు.. అందుకు అనుగుణంగానే యూఎస్ ఓపెన్ లో సత్తా చాటుతున్నాడు.క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌ 5-7, 6-2, 6-2, 6-3తో ఆరో సీడ్‌ మటియో బెరెటినీ (ఇటలీ)పై విజయం సాధించాడు. మిగతా క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6-3, 6-0, 4-6, 7-5తో నెదర్లాండ్స్‌కు చెందిన బొటిక్‌ వాన్‌ డె జండ్‌ష్చల్ప్‌పై గెలుపొందగా, నాలు గో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 7-6 (8/6), 6-3, 6-4తో లాయిడ్‌ హారిస్‌ (దక్షిణాఫ్రికా)పై నెగ్గాడు. మహిళల క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)కు 4-6, 4-6తో మరియా సకారి (గ్రీస్‌) చేతిలో చుక్కెదురైంది.

    జకోవిచ్, బెరెటిని మధ్య జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌ హోరాహోరీగా మొదలైంది. పది గేమ్‌ల దాకా ఇద్దరు సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 5-5తో సమంగా నిలిచారు. సెర్బియన్‌ సర్వీస్‌ చేసిన 11వ గేమ్‌ను బ్రేక్‌ చేయడం ద్వారా బెరెటిని 6-5తో ఆధిక్యంలోకి వచ్చాడు. తదుపరి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో తొలిసెట్‌ను చేజిక్కించుకున్నాడు.

    ఈ సెట్‌ కోల్పోగానే జకో జాగ్రత్త పడ్డాడు. తర్వాత వరుసగా మూడు సెట్లను అవలీలగానే చేజిక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 12 ఏస్‌లు సంధించిన సెర్బియన్‌ స్టార్‌ 4 డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌ వద్ద 19 పాయింట్లు సాధించిన జకోవిచ్‌ 44 విన్నర్లు కొట్టాడు. 28 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 5 బ్రేక్‌ పాయింట్లు సాధించి ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు.


    ఇప్పటివరకు మూడు సార్లు (2011, 2015, 2018) యూఎస్‌ చాంపియన్‌గా నిలిచిన జకోవిచ్‌ ఇక్కడ సెమీస్‌ చేరుకోవడం ఇది 12వ సారి. ఇక, సెమీఫైనల్లో సెర్బియన్‌ స్టార్‌... జర్మనీకి చెందిన నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు.


    మరోవైపు కెరీర్‌లో మొట్టమొదటి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ దిశగా సాగుతున్న గ్రీసు అమ్మాయి సకారి.. తొలిసారి యూఎస్ ఓపెన్‌ సెమీస్‌ చేరింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఈ 17వ సీడ్‌ అమ్మాయి 6-4, 6-4 తేడాతో నాలుగో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గింది. 2016లో యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచిన చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ను కేవలం గంటా 22 నిమిషాల్లోనే సకారి ఇంటిదారి పట్టించింది. 2015 నుంచి యూఎస్‌ ఓపెన్‌ ఆడుతున్న గ్రీస్‌ ప్లేయర్‌ సకారి తన కెరీర్‌లో తొలిసారి సెమీస్‌ చేరింది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Novak Djokovic, Sports, Tennis

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు