U-19 World Cup : మహిళల అండర్ 19 ప్రపంచకప్ (U-19 Women's World Cup)లో యువ టీమిండియా (Team India)కు తొలి ఓటమి ఎదురైంది. సూపర్ సిక్స్ లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల (Australia Women)తో జరిగిన పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడింది. భారత్ నిర్దేశించిన 88 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు 13.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించి విజేతగా నిలిచింది. క్లైర్ మూరే (28 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), అమీ స్మిత్ (25 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. వరుస విజయాలతో సూపర్ సిక్స్ కు దూసుకొచ్చిన భారత్ కు.. ఆస్ట్రేలియా రూపంలో స్పీడ్ బ్రేకర్ ఎదురైంది.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియాకు భారత బౌలర్ల నుంచి ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వలేదు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆసీస్ సులభమైన విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 18.5 ఓవర్లలో 87 పరుగులకు ఆలౌటైంది. సియాన జింజర్ మూడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించింది. మిల్లీ ఇల్లింగ్ వర్త్, మ్యాగీ క్లర్క్ చెరో రెండు వికెట్లు తీశారు. భారత బ్యాటింగ్ లో ఓపెనర్ శ్వేత షెరావత్ (29 బంతుల్లో 21; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. బసు (14), టిటాస్ సదు (14) మినహా మిగిలిన వారు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.
ఇది కూడా చదవండి : టాస్ సమయంలో గజినిలా మారిపోయిన రోహిత్.. బిక్క మొహం వేసిన లేథమ్.. అసలేం జరిగిందంటే?
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత్ ను బ్యాటింగ్ కు అహ్వానించింది. గ్రూప్ దశలో అదరగొట్టిన భారత్.. సూపర్ సిక్స్ లో మాత్రం తడబడింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కెప్టెన్, స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ (8) 2 ఫోర్లు బాది వికెట్ ను పారేసుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా క్రీజులోకి అలా వచ్చి ఇలా వెళ్లారు. ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఫలితంగా భారత్ క్రమం తప్పకుండా వికెట్లను పారేసుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న పవర్ హిట్టర్ రిచా ఘోష్ (7) కూడా నిరాశ పరిచింది. చివర్లో బసు, టిటాస్ సదు కాసిన్ని పరుగులు సాధించడంతో భారత్ 80 పరుగుల మార్కును దాటగలిగింది. లేదంటే 60 పరుగులకే చాపచుట్టేసేది.
తుది జట్లు
భారత మహిళల జట్టు
శ్వేత షెరావత్, షఫాలీ వర్మ, త్రిషా, సోనియా, రిచా ఘోష్, చోప్రా, బసు, కశ్యప్, సదు, అర్చన దేవి, సోనమ్ యాదవ్
ఆస్ట్రేలియా మహిళల జట్టు
కేట్ పెల్లె, జింజర్, క్లైర్ మోర్, ఎల్లా హేవార్డ్, అమి స్మిత్, లూసీ హామిల్టన్, రైస్ మెక్ కెన్నె, ప్యారీస్ హాల్, ఎల్లా విల్సన్, మిల్లీ ఇల్లింగ్ వర్త్, మ్యాగీ క్లార్క్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, IND vs AUS, India vs australia, South Africa, Team India