Archana Devi : కేన్సర్ (Cancer) తో భర్త మరణం.. ఆ వెంటనే పాము కాటుకు కొడుకు మృతి.. అంతే ఊరి ప్రజలంతా ఆ తల్లిపై కక్ష గట్టారు. నష్ట జాతకురాలంటూ ఆమెను కన్నెత్తి చూసే వారు కాదు. ఆమెను చూస్తే అరిష్టం అంటూ ప్రచారం చేశారు. ఇక కూతురిని వేరే ఊళ్లో ఉంచి చదివిస్తుంటే.. డబ్బుకు అమ్మేసిందంటూ.. ఏదో పాడు పనిలో దింపిందంటూ కూడా ఆ మాతృమూర్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా ఆ తల్లి ఏనాడు ఇసుమంత కూడా భయపడలేదు. చనిపోతూ తన చిన్న కొడుకు కోరిన ఆఖరి కోరికను నిజం చేసేందుకు అహర్నిశలు కష్టపడింది. తన కూతురిని టీమిండియా స్థాయికి తీర్చి దిద్దింది. ఇప్పుడు ఆ కూతురే ప్రపంచకప్ గెలిచి అవనిని పులకించేలా చేసింది.
దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా జరిగిన అండర్ 19 మహిళల ప్రపంచకప్ (U-19 Womn's World cup 2023) విజేతగా టీమిండియా (Team India) నిలిచింది. షఫాలీ వర్మ (Shafali Verrma) నాయకత్వంలోని యువ భారత్ ఫైనల్లో ఇంగ్లండ్ పై 7 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ టోర్నీలో అర్చనా దేవి బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతంగా రాణించింది. ఫైనల్లో కళ్లు చెదిరే క్యాచ్ ను కూడా అందుకుంది. అంతేకాకుండా రెండు కీలక వికెట్లను తీసింది. ఈ విజయంతో దేశ మహిళా క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఈ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులోని ప్రతి ఒక్కరిదీ ఒక విజయగాథే అయినా అర్చనా దేవిది మాత్రం భిన్నమైనది. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలోని రతై పూర్వ గ్రామంలోని చాలా నిరుపేద కుటుంబంలో అర్చనా దేవి జన్మించింది. తల్లి సావిత్రి దేవి అండదండలతో క్రికెటర్‌గా ఎదిగింది. ఈ క్రమంలో తల్లి సావిత్రి ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఇన్నీ కాదు.
సావిత్రి దేవికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు.. ఒక కూతురు. అర్చనా దేవి ఆఖరి సంతానం. 2008లో అర్చానా దేవి త్రండి కేన్సర్ తో మరణించాడు. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను సావిత్రే చూసుకుంది. చిన్న కొడుకు బుద్దిమాన్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. చెల్లెలు అర్చనా దేవితో కలిసి ఇంటి దగ్గర ఉన్న పొలాల్లో క్రికెట్ ఆడేవాడు. అన్నకు ఏ మాత్రం తగ్గకుండా అర్చనా దేవి క్రికెట్ ఆడేది. అయితే అర్చనా క్రికెట్ ఆడటం సావిత్రికి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఒక రోజు క్రికెట్ ఆడుతూ బంతి కోసం పొద్దల్లోకి వెళ్లాడు బుద్దిమాన్. బంతిని తీసుకుంటుంటే అక్కడే ఉన్న పాము అతడిని కాటేసింది. వెంటనే కొడుకుని ఆటోలో హాస్పిటల్ కు తీసుకెళ్లినా బుద్దిమాన్ ను మాత్రం కాపాడుకోలేకపోయింది సావిత్రి దేవి. కొన ఊపిరితో ఉన్న బుద్ధిమాన్ 'అర్చనను క్రికెట్ మాన్పించవద్దు' అని చెప్పి మరణించాడు. ఆ రోజు సావిత్రి సంకల్పించుకుంది ఎలాగైనా అర్చనను క్రికెటర్ చేయాలని.
భర్త, కొడుకుని కోల్పోవడంతో ఆమెను నష్టజాతకురాలంటూ ప్రచారం చేశారు. ఆమె ఎదురొస్తే అరిష్టమన్నారు. ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలను ఛీత్కారాలను ఎదుర్కొంది. ఒక దశలో ఆమె ఇంటికి వచ్చేందుకు కూడా ఆ ఊరి ప్రజలు ఇష్టపడే వారు కాదు. సావిత్రి దేవి ఇంట్లో నీళ్లు కూడా తాగే వారు కాదు. ఆమె వస్తుందంటే పక్కకు తప్పుకునే వారు. కానీ, ఇప్పుడు మొత్తం మారిపోయింది. ప్రపంచకప్ గెలిచిన తర్వాత అర్చన దేవి తల్లిని నిందించిన వారే ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకప్పుడు తమ ఇంట నీళ్లు కూడా తాగనివారు.. ఇవాళ అతిథులుగా వచ్చి మీ దశ తిరిగిందని భోజనం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND VS ENG, India vs england, Team India, World cup