IND W vs NZ W : మహిళల అండర్ 19 ప్రపంచకప్ (U-19 World Cup 2023) ఆఖరి దశకు చేరుకుంది. సౌతాఫ్రికా (South Africa) వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్ సెమీస్ అంకానికి చేరుకుంది. 16 జట్లతో మొదలైన ఈ టోర్నీ.. ప్రస్తుతం నాలుగు జట్లకు చేరుకుంది. తొలి సెమీఫైనల్లో షఫాలీ వర్మ (Shafali Verma) నాయకత్వంలోని టీమిండియా (Team India).. న్యూజిలాండ్ (New Zealand) మహిళల జట్టుతో తలపడనుంది. మరో సెమీస్ పోరులో ఆస్ట్రేలియా తో ఇంగ్లండ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండి మహిళల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఎటువంటి మార్పులు చేయలేదు. ఆఖరి మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. న్యూజిలాండ్ కూడా ఎటువంటి మార్పులు చేయలేదు.
టఫ్ ఫైట్
ఈ టోర్నీలో న్యూజిలాండ్ వరుస విజయాలతో మంచి జోష్ మీదుంది. మరోవైపు భారత్ మాత్రం ఆస్ట్రేలియాపై మాత్రమే ఓడింది. ఏ రకంగా చూసినా ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. శ్రీలంకపై భారత్ గెలిచి సెమీస్ చేరితే.. బంగ్లాదేశ్ పై నెగ్గిన కివీస్ తుది నలుగురిలో చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో రెండు జట్ల మధ్య జరిగే ఈ పోరు ఆసక్తికరంగా మారనుంది.
సెమీస్ గండం
ఆటతో సంబంధం లేకుండా భారత్ ను గత కొన్నేళ్లుగా సెమీస్ గండం వణికిస్తోంది. గ్రూప్ లో అదరగొట్టే భారత్ నాకౌట్ దశలో మాత్రం చేతులెత్తేస్తుంది. ఇక క్రికెట్ లో నాకౌట్ మ్యాచ్.. అది కూడా కివీస్ ప్రత్యర్థి అంటే భారత అభిమానుల్లో ఒకింత ఆందోళన కలగడం ఖాయం. ప్రస్తుతం జరుగుతున్న హాకీ ప్రపంచకప్ లోనూ భారత్ కివీస్ చేతిలో ఓడి క్వార్టర్స్ కు అర్హత సాధించలేకపోయింది. అయితే మహిళల జట్టు కివీస్ గండం నుంచి గట్టెక్కుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం టీంను చూస్తే బౌలింగ్ అద్భుతంగా ఉంది. అయితే బ్యాటింగ్ కాస్త బలహీనంగా ఉంది. పవర్ హిట్టర్స్ ఉన్నా తొందరపడి వికెట్లను చేజార్చుకుంటున్నారు. ఈ జాబితాలో సీనియర్ టీం ప్లేయర్స్ షఫాలీ వర్మ, రిచా ఘోష్ లు ఉండటం గమనార్హం. కివీస్ లాంటి టీంను ఓడించాలంటే భారత్ అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంది.
తుది జట్లు
న్యూజిలాండ్ అండర్ 19 మహిళల జట్టు
మెక్ లియోడ్, బ్రౌనింగ్, ప్లిమ్మర్, గేజ్, షార్ప్, ఇర్విన్,కె.ఇర్విన్, కొడైర్, కైన్, హాటన్, లాగెన్ బర్గ్
టీమిండియా అండర్ 19 మహిళల జట్టు
షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేత షెరావత్, సౌమ్య తివారి, త్రిష, రిచా ఘోష్, బసు, సదు, కశ్యప్, అర్చన దేవి, చోప్రా, సోనమ్ యాదవ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ind vs Nz, India vs newzealand, South Africa, Team India