U-19 Women's World Cup 2023 : తొలిసారి జరుగుతున్న అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ (U-19 Women'sT20 World Cup) ఫైనల్లో భారత జట్టు (Indian Cricket Team) అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ (England) మహిళల జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో సాధు, అర్చనా దేవి, పర్షవి చోప్రా తలా రెండు వికెట్లు తీశారు. టి20 ప్రపంచకప్ నెగ్గాలంటే భారత్ 69 పరుగులు చేస్తే చాలు. అయితే ఇంగ్లండ్ చివరి వరకు పోరాడే అవకాశం ఉంది. దాంతో భారత్ జాగ్రత్తగా ఆడి ప్రపంచ చాంపియన్ గా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ లో రైన్ మెక్ డొనాల్డ్ (24 బంతుల్లో 19; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కావడం విశేషం. ఇంగ్లండ్ బ్యాటింగ్ లో నలుగురు మినహా మిగిలిన ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం మన బౌలింగ్ బలాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
భారత స్పిన్నర్లు మరోసారి అదరగొట్టారు. ఈ టోర్నీ మొత్తం భారత్ కేవలం ఒకే ఒక పేసర్ తో బరిలోకి దిగుతూ వచ్చింది. ఫైనల్లో కూడా సాధును మాత్రమే పేసర్ గా తీసుకుంది. ఇక సాధు తొలి ఓవర్లోనే హీప్ (0)ను అవుట్ చేసింది. టోర్నీ టాప్ స్కోరర్ గా ఉన్న కెప్టెన్ గ్రేస్ స్క్రీవెన్స్ (4)ను అర్చన దేవి పెవిలియన్ కు చేర్చింది. ఇక్కడి నుంచి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. రెండు వైపుల స్పిన్ అటాక్ తో ఇంగ్లండ్ ను ఉక్కిరి బిక్కిరి చేసింది షఫాలీ వర్మ. ఒక దశలో 50 పరుగుల మార్కును దాటేది కూడా కష్టంగా కనిపించింది. అయితే మెక్ డొనాల్డ్ కాస్త ప్రతిఘటించడంతో ఇంగ్లండ్ 68 పరుగుల వరకు చేరుకోగలిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 99 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఆస్ట్రేలియా లాంటి జట్టుని 96 పరుగులకు పరిమితం చేసింది. భారత్ ఆస్ట్రేలియా చేతిలో మాత్రమే ఓడింది. అటువంటి ఆసీస్ పై నెగ్గిన ఇంగ్లండ్ అంత తేలికగా ఓటమిని అంగీకరించే అవకాశం లేదు.
తుది జట్లు
ఇంగ్లండ్
గ్రేస్ స్క్రీవెన్స్ (కెప్టెన్), లిబర్టీ హీప్, హోలాండ్, సెరెన్ స్మెల్, క్రిస్ పావెలీ, రైన్ మెక్ డొనాల్డ్, అలెక్సా, గ్రూవ్స్, అండర్సన్, సోఫియా స్మెల్, హన్నా బేకర్
టీమిండియా
షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేత షెరావత్, సౌమ్య తివారి, త్రిష, రిచా ఘోష్, బసు, సదు, కశ్యప్, అర్చన దేవి, చోప్రా, సోనమ్ యాదవ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND VS ENG, India vs england, Team India