U-19 Women's World Cup 2023 : దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా జరుగుతున్న తొలి అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ (U-19 Women's World cup 2023)లో టీమిండియా (Team India) చరిత్ర సృష్టించింది. షఫాలీ వర్మ (Shafali Verma) నాయకత్వంలోని భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్ (England Women's Team)పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్ 14 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 69 పరుగులు చేసి నెగ్గింది. సౌమ్య తివారి (37 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (28 బంతుల్లో 24; 3 ఫోర్లు) భారత్ కు కప్పును అందించడంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ షఫాలీ వర్మ (11 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) భారత్ కు శుభారంభం చేసింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు షఫాలీ వర్మ ధనాధన్ ఆరంభాన్ని ఇచ్చింది. సిక్స్, ఫోర్ తో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. అయితే దూకుడుగా ఆడే ప్రయత్నంలో షఫాలీ మరోసారి తన వికెట్ ను మరోసారి పారేసుకుందిి. ఇక టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న శ్వేత (5) విఫలం అయ్యింది. ఈ దశలో భారత్ కాస్త ఒత్తిడిలోకి వెళ్లింది. అయితే క్రీజులోకి వచ్చిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష.. సౌమ్య తివారితో కలిసి జట్టు బాధ్యతను తీసుకుంది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన త్రిష.. ఆ తర్వాత రెచ్చిపోయింది. క్లాస్ షాట్లతో అలరించింది. వెంట వెంటనే మూడు ఫోర్లు బాదడంతో భారత్ చేయాల్సిన పరుగులు సింగిల్ డిజిట్ కు చేరుకుంది. అయితే ఆఖర్లో భారీ షాట్ కు ప్రయత్నించి మ్యాచ్ ను ముగిద్దామనే ప్రయత్నంలో త్రిష బౌల్డ్ అయ్యింది. ఆ మరుసటి ఓవర్లోనే భారత్ గెలిచేసింది. అమ్మాయిల క్రికెట్ లో (సీనియర్ విభాగాన్ని కలిపి) భారత్ కు అతి పెద్ద విజయం ఇదే కావడం విశేషం. సీనియర్ విభాగంలో మూడు సార్లు ఫైనల్ కు చేరినా భారత్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. అయితే అండర్ 19లో నెగ్గి ప్రపంచకప్ కోరికను తీర్చుకుంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో సాధు, అర్చనా దేవి, పర్షవి చోప్రా తలా రెండు వికెట్లు తీశారు. టి20 ప్రపంచకప్ నెగ్గాలంటే భారత్ 69 పరుగులు చేస్తే చాలు. అయితే ఇంగ్లండ్ చివరి వరకు పోరాడే అవకాశం ఉంది. దాంతో భారత్ జాగ్రత్తగా ఆడి ప్రపంచ చాంపియన్ గా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ లో రైన్ మెక్ డొనాల్డ్ (24 బంతుల్లో 19; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కావడం విశేషం. ఇంగ్లండ్ బ్యాటింగ్ లో నలుగురు మినహా మిగిలిన ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం మన బౌలింగ్ బలాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND VS ENG, India vs england, Team India, World cup