U-19 Women's World Cup 2023 : భారత మహిళల క్రికెట్ కు జనవరి 29 ఒక తీపి గుర్తుగా మిగిలి పోనుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్ (World Cup) కల తీరిన రోజది. పురుషుల క్రికెట్ లో భారత్ పలుమార్లు విశ్వవిజేతగా నిలిచింది. సీనియర్ స్థాయిలో మూడు సార్లు టీమిడియా (Team India) ప్రపంచకప్ ను నెగ్గింది. ఇందులో రెండు వన్డే ప్రపంచకప్ లు కాగా.. మరొకటి టి20 ప్రపంచకప్. ఇక అండర్ 19 విభాగంలో అయితే ఏకంగా 5 సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. అయితే మహిళల క్రికెట్ లో మాత్రం భారత్ ఒక్కసారి కూడా విశ్వవిజేతగా నిలవలేకపోయింది. సీనియర్ స్థాయిలో మూడు సార్లు ఫైనల్స్ కు చేరినా.. ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయింది.
అండర్ 19 మహిళల విభాగంలో తొలిసారి టి20 ప్రపంచకప్ ను నిర్వహించగా.. అందులో యువ భారత్ మెరిసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ పై 7 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి కప్పును అందుకుంది. ఇక ఈ మ్యాచ్ లో బెంగాల్ పేసర్ టిటాస్ సాధు అద్బుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్లో 4 ఓవర్లు వేసిన ఆమె కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను తీసింది. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా అందుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె పేరు బెంగాల్ తో పాటు దేశమంతా మార్మోగిపోతుంది. ఈ క్రమంలో టిటాస్ సాధు ప్రపంచకప్ గెలిచిన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది.
తాము విశ్వవిజేతలమన్న విషయాన్ని నమ్మబుద్ది కావడం లేదని టిటాస్ సాధు పేర్కొంది. అంతా కలలా ఉందని ఆమె పేర్కొంది. ప్రపంచకప్ గెలవగానే సంబరాలు మొదలు పెట్టినట్లు ఆమె పేర్కొంది. మిథాలీ, జులన్ గోస్వామి లాంటి వాళ్లకు సాధ్యం కాని పనిని మీరు సాధించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారనే ప్రశ్నకు టిటాస్ చాలా హుందాగా సమాధానం ఇచ్చింది. దేశం తరఫున ప్రపంచకప్ గెలవడం ఎప్పుడు గర్వంగా ఉంటుందని ఆమె పేర్కొంది. జులన్ గోస్వామి తన ఫేవరెట్ క్రికెటర్ అని పేర్కొంది. ఆమెను చూసే తాను క్రికెట్ వైపు అడుగులు వేశానని.. ఫాస్ట్ బౌలర్ గా రాణించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు టిటాస్ సాధు పేర్కొంది. ఈ టోర్నీలో భారత్ ఒకే ఒక్క పేసర్ తోనే బరిలోకి దిగింది.
తొలి ఓవర్ వేసే టిటాస్ సాధు ప్రతి మ్యాచ్ లోనే భారత్ కు అద్భుత ఆరంభాన్ని ఇచ్చింది. మొదటి ఓవర్ లోనే వికెట్ తీసి ప్రత్యర్థిని ఒత్తడిలోకి నెట్టింది. ఫైనల్లో కూడా తొలి ఓవర్లోనే హీప్ (0)ను డకౌట్ చేసింది. బెంగాల్ నుంచి సీనియర్ స్థాయిలో జులన్ గోస్వామి అద్బుతాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె గతేడాది రిటైర్మెంట్ ప్రకటించింది. త్వరలోనే టిటాస్ సాధు సీనియర్ టీంలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఆమె మరో గోస్వామిలా రికార్డులు నెలకొల్పాలని కోరుకుందాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND VS ENG, India vs england, Team India, World cup