TOKYO PARALYMPICS 2021 UPDATES DISCUS THROWER VINOD KUMAR BRONZE MEDAL KEPT IN HOLD FOR THIS REASON SRD
Tokyo Paralympics: వినోద్ కుమార్ పతకంపై ఇంకా రాని క్లారిటీ..! పేచీలు పెడుతున్న ప్రత్యర్థులు..
Vinod Kumar(PC: Twitter/ANI)
Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో క్రీడల ప్రారంభోత్సవానికి ముందే అథ్లెట్ల అవయవలోప శక్తి సామర్థ్యాల ఆధారంగా వారిని వివిధ కేటగిరీలుగా వర్గీకరణ చేస్తారు. ఒకే స్థాయి శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని సంబంధిత ఈవెంట్లకు ఎంపిక చేస్తారు.
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ (Tokyo Paralympics)లో భారత క్రీడాకారులు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే టీటీ, హైజంప్‌లో సిల్వర్ మెడల్స్ గెలువగా.. పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్ 52) భారత్ కు చెందిన వినోద్ కుమార్ (Vinod Kumar) కాంస్యం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, మనోడు కాంస్యం (Bronze Medal) సాధించినా నిర్వాహుకులు ఇంకా పతకాన్ని వినోద్ కుమార్ కి అందజేయలేదు. వినోద్ కుమార్ ఫలితాన్ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారు. డిస్కస్ త్రో పాల్గొన్న ఇతర అథ్లెట్లు వినోద్ ఎంపిక, వర్గీకరణపై నిరసన తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. ఈ విషయంపై చర్చలు జరిపిన తర్వాత సోమవారం సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పారాలింపిక్స్‌లో క్రీడల ప్రారంభోత్సవానికి ముందే అథ్లెట్ల అవయవలోప శక్తి సామర్థ్యాల ఆధారంగా వారిని వివిధ కేటగిరీలుగా వర్గీకరణ చేస్తారు. ఒకే స్థాయి శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని సంబంధిత ఈవెంట్లకు ఎంపిక చేస్తారు. ఈ క్రమంలోనే ఈనెల 22న వినోద్‌ను పరీక్షించిన నిర్వాహకులు F52 డిస్కస్‌త్రో ఈవెంట్‌కు ఎంపిక చేశారు. పోటీల్లో పోలాండ్‌కు చెందిన పియోటర్ కోసెవిచ్ 20.02 మీటర్ల ప్రయత్నంతో స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, క్రొయేషియాకు చెందిన వెలిమిర్ సాండర్ 19.98 మీటర్ల దూరం విసిరి రజతం సాధించాడు. వినోద్ 17.46 మీటర్ల ప్రయత్నంతో ఫైనల్ ప్రారంభించి తన ఆటకు మెరుగులద్దాడు. ఐదవ, చివరి ప్రయత్నంలో 19.91 మీటర్ల దూరం డిస్కస్ విసిరి కాంస్య పతకం సాధించే మార్కును అందుకోగలిగాడు.
అయితే, ఇతర పోటీదారులు వినోద్‌పై నిరసన తెలపడంతో నిర్వాహకులు పతకాల బహూకరణ నిలిపివేశారు. ఈ F52 ఈవెంట్లో బలహీనమైన కండరాల శక్తి కలిగిన అథ్లెట్లతో పాటు పరిమిత కదలిక అవయవలోపం ఉన్నవాళ్లు, కాళ్ల పొడవు వ్యత్యాసం ఉన్నవాళ్లు, వెన్నెముక సరిగా లేనివాళ్లు, క్రియాత్మక రుగ్మతతో కూర్చున్న స్థితిలో ఉన్న అథ్లెట్లు మాత్రమే పాల్గొంటారు. ఇందులో వినోద్‌ను ఏ విధంగా ఎంపిక చేశారనేది స్పష్టత లేదు.
ఇక, అంతకు ముందు జరిగిన పురుషుల హై జంప్ టీ-47 కేటగిరీలో భారత ప్లేయర్ నిషధ్ కుమార్ రజత పతకం సాధించాడు. అమెరికా అథ్లెట్ డల్లాస్ వైస్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచిన అతను సిల్వర్ మెడల్‌ను షేర్ చేసుకున్నాడు. ఫైనల్ రౌండ్లో 1.94 మీటర్లను సునాయసంగా అధిగమించిన నిషద్ కుమార్.. 1.98 మీటర్లకు కొంత కష్టపడ్డాడు. రెండో ప్రయత్నంలో ఎట్టకేలకు అధిగమించి టాప్కు దూసుకెళ్లాడు. కానీ అమెరికా అథ్లెట్లు డల్లాస్ వైస్, రొడెరిక్ టౌన్సెండ్ అతనికి గట్టి పోటీనిచ్చారు. 2.06 మీటర్లను క్లియర్ చేసి నిషద్ పతకాన్ని ఖాయం చేసుకోగా..డల్లాస్ వైస్ కూడా అంతే ఎత్తును క్లియర్ చేసి సమంగా నిలిచాడు. ఇక 2.15 మీటర్లతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన రొడెరిక్ టౌన్సెండ్ స్వర్ణపతకం సాధించాడు. ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో భారత హై జంపర్ రాంపాల్ చాహర్ పోడియం ఎక్కలేకపోయాడు. ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 1.96 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన రాంపాల్.. 1.98 మీటర్ల ఎత్తును క్లియర్ చేయలేకపోయాడు.
ఉదయం జరిగిన మహిళల టేబుల్ టెన్నిస్ విభాగం సింగిల్స్ క్లాస్ 4 ఫైనల్లో భవీనాబెన్ పటేల్ 7-11, 5-11, 6-11 స్కోర్ తేడాతో చైనాకు చెందిన యింగ్ ఝౌ చేతిలో పరాజయం పాలైంది. దాంతో ఆమె రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మెడల్ సాధించిన అనంతరం భవీనా పటేల్ మీడియాతో మాట్లాడింది. ఫైనల్లో తన ప్రదర్శన పట్ల నిరాశగా ఉన్నానని, స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయానని అంగీకరించింది. వచ్చే టోర్నీల్లో ఈ తప్పిదాలను పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపింది. గుజరాత్‌కు చెందిన భవీనాబెన్ పటేల్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్ల నజరానా ప్రకటించింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.