జపాన్ వాసులకు అక్కడి ప్రభుత్వం (Japan Government) షాకిచ్చింది. మరో రెండు వారాల్లో టోక్యో వేదికగా విశ్వ క్రీడలు (Tokyo Olympics) ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షల నడుమ 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా టోక్యో సహా ఇతర నగరాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. ప్రేక్షకులు లేకుండానే (Without Spectators) ఒలింపిక్స్ నిర్వహించనున్నామని ప్రకటించింది. గురువారం జపాన్ ప్రధాని యొషిహిదే సుగా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ భేటీ అయ్యింది. దేశంలో నాలుగో సారి ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకున్నది. ఆ వెంటనే జపాన్ ఒలింపిక్ మంత్రి తమాయో మరుకావా ప్రేక్షకులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. జులై 12 నుంచి జులై 22 వరకు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో జపాన్‌లో ఎమర్జెన్సీ విధించడం ఇది నాలుగో సారి. సరిగ్గా ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు రోజు వరకు ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది. ఎమర్జెన్సీ ఆంక్షల నడుమే సమ్మర్ ఒలింపిక్స్‌తో పాటు ఆ తర్వాత పారాలింపిక్స్ కూడా జరుగుతాయిని జపాన్ సర్కర్ స్పష్టం చేసింది.
ఎమర్జెన్సీ సమయంలో ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించనున్నారు. ఒలింపిక్స్ జరిగే సమయంలో కూడా ఈ నిషేధం అమలులో ఉండనున్నదని ప్రభుత్వం ప్రకటించింది. విశ్వక్రీడలకు సంబంధించిన సంబరాలను, పార్టీలను తగ్గించడానికే మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు జపాన్ ప్రధాని సుగ తెలిపారు. క్రీడాభిమానులు, జపాన్ వాసులు అందరూ టీవీల్లో ఒలింపిక్స్ వీక్షించాలని ప్రభుత్వం సూచించింది. పార్టీల కోసం ఎవరూ రోడ్లపై చేరవద్దని.. అందరూ క్రమ శిక్షణ పాటించాలని కోచింది. గతంలో మూడు సార్లు జపాన్ ప్రభుత్వం ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీ విధించింది. ప్రస్తుతం అమలులో ఉన్న మూడో ఎమర్జెన్సీ జులై 11న ముగియనున్నది. ఆ వెంటనే 12 నుంచి నాలుగో ఎమర్జెన్సీ ప్రారంభం కానున్నది.
కాగా, విశ్వ క్రీడల కోసం ప్రపంచ దేశాల నుంచి అథ్లెట్ల రాక ప్రారంభమైంది. అందరికీ జపాన్ చేరుకున్న వెంటనే యాంటీ జెన్ టెస్టులు చేస్తున్నారు. ఆ తర్వాత వారిని మూడు రోజుల పాటు క్వారంటైన్‌కు పంపిన తర్వాత మరోసారి టెస్టులు చేసి నెగెటివ్ వస్తేనే క్రీడా గ్రామంలోకి అనుమతి ఇస్తున్నట్లు టోక్యో ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ చెబుతున్నది. ఆటగాళ్లు, సిబ్బంది, ఇతర అధికారులు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. ఎవరైనా రూల్ బుక్ నియమాలను అతిక్రమిస్తే క్రీడల నుంచే కాకుండా జపాన్ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid-19, Tokyo Olympics