హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం.. జపాన్ గడ్డపై రెపరెపలాడిన త్రివర్ణపతాకం..

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం.. జపాన్ గడ్డపై రెపరెపలాడిన త్రివర్ణపతాకం..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Tokyo Olympics : టోక్యో గడ్డపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని హాకీ పురుషుల జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా బాక్సర్ మేరీకోమ్ త్రివర్ణ పతకాన్ని చేబూని నడిపించారు.

విశ్వక్రీడలు టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. నిజానికి గతేడాది జరగాల్సిన ఈ క్రీడల కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు నేడు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అత్యంత సాదాసీదాగా 1000 మంది అతిథుల సమక్షంలో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం మొదలైంది. జపాన్ చక్రవర్తి నరహిటో క్రీడలను ప్రారంభించారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని హాకీ పురుషుల జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా బాక్సర్ మేరీకోమ్ త్రివర్ణ పతకాన్ని చేబూని నడిపించారు. ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు జపాన్ పతాకం స్టేడియంలోకి ప్రవేశించింది. చారిత్రక నేపథ్యం కలిగిన గ్రీస్ బృందంతో పరేడ్ మొదలైంది. ఐవోసీ శరణార్థి ఒలింపిక్ జట్టును స్టేడియంలోకి ఆహ్వానించారు. ఈ జట్టుకు ఆహ్వానం పలకడం ఒలింపిక్ చరిత్రలో ఇది రెండోసారి. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ సందర్భంగా పాలస్తీనియన్ గన్‌మెన్ చేతిలో హత్యకు గురైన ఇజ్రాయెల్ ఒలింపిక్ జట్టును ఈ సందర్భంగా గుర్తు చేసుకుని మౌనం పాటించారు. ఇజ్రాయెల్ జట్టును స్మరించుకోవడం ఒలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి.

కరోనా దెబ్బకు ఒక ఏడాది వాయిదా పడ్డా, మరోసారి మహమ్మారి సవాళ్లు విసురుతున్నా.. అటు నిర్వాహకులు, ఇటు క్రీడాకారులు విశ్వ క్రీడా సంబరాన్ని విజయవంతం చేయడానికి పట్టుబట్టి ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టారు. 200కు పైగా దేశాలు.. 11 వేల మందికి పైగా అథ్లెట్లు.. 60 వేలకు పైగా నిర్వాహక సిబ్బంది మెగా క్రీడల కోసం సిద్ధమయ్యారు. ఇక వచ్చే రెండు వారాలు వందల కోట్ల మంది అభిమానులకు పండగే. క్షణ క్షణం ఉత్కంఠకు గురవుతూ.. భావోద్వేగాల్లో మునిగి తేలడం గ్యారెంటీ.

టోక్యోలో కొవిడ్‌ విజృంభణతో ఇప్పటికే నాలుగో దశ ఎమర్జెన్సీ అమలులో ఉంది. తొలుత 10వేలమంది ప్రముఖులను ప్రారంభోత్సవానికి అనుమతించాలనుకున్నారు. కానీ కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఖాళీ స్టేడియంలోనే ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. దీంతో 60వేల మంది సామర్థ్యం కలిగిన అత్యాధునిక నేషనల్‌ స్టేడియంలో వేయిమంది అతిథులతోనే కార్యక్రమం జరిగింది. వీఐపీల్లో జపాన్‌ చక్రవర్తి నరుహిటో ముఖ్యుడు. అమెరికా అధ్యక్షుడి సతీమణి, ఆ దేశ ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ విదేశీ అతిథుల్లో ప్రముఖులు.

First published:

Tags: Sports, Team India, Tokyo Olympics

ఉత్తమ కథలు