ఒలింపిక్స్ రెజ్లింగ్ లో నిరాశ ఎదురైంది. గోల్డ్ మెడల్ సాధిస్తాడనుకున్న రవి దహియా ఫైనల్ లో ఓడిపోయాడు. అయినా రజతంతో మెరిశాడు. ఒలింపిక్స్‌కు ఇండియా వెళ్లినప్పుడు అతని పేరు పెద్దగా వినిపించలేదు. పక్కాగా మెడల్ తీసుకొస్తాడన్న లిస్ట్‌లో రవికుమార్ దహియా ( Ravi Kumar Dahiya ) పేరు లేనే లేదు. కానీ అతడు ఎవరూ ఊహించని సంచలన విజయాన్ని సాధించాడు. రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైనల్ లో ఓడినా.. భారత్ కు రజతాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్ లో రష్యాకి చెందిన జౌర్ ఉగేవ్ చేతిలో 4-7 తేడాతో ఓడిపోయాడు.
తొలి బ్రేక్ సమయానికి 2-4 తేడాతో ఆధిక్యం సాధించిన జవుర్, ఆ తర్వాత వరుస పాయింట్లు స్కోరు చేసి 2-7 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రెండు పాయింట్లు సాధించిన రవికుమార్ 4-7 తేడాతో ఆధిక్యాన్ని తగ్గించాడు.
2012 లండన్ ఒలింపక్స్‌తో రజతం గెలిచిన రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన భారత రెజ్లర్‌గా నిలిచాడు రవికుమార్ దహియా.
రవికుమార్ దహియా పతకంతో కలిపి టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 5కి చేరింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాభాను ఛాను రజతం సాధించగా, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో లవ్‌లీనా కాంస్య పతకాలు సాధించారు. భారత పురుషుల హాకీ, జర్మనీని ఓడించి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
భారత రెజ్లింగ్ అంటే ఇన్నాళ్లూ సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ పేర్లే ఠక్కున గుర్తుకు వచ్చేవి. కానీ ఈరోజు నుంచి అందరికీ తన పేరు చిరకాలం గుర్తుండిపోయేలా చేశాడు భారత యువ రెజ్లర్ రవి కుమార్ దహియా. తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన ఈ హరియాణా మల్లయోధుడు ‘టోక్యో’లో తన ‘పట్టు’దలతో ప్రకంపనలు సృష్టించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Tokyo Olympics, Wrestling