Tokyo Olympics : 125 ఏళ్ల చరిత్రలో అరుదైన రికార్డు.. ఒకే రోజు అన్నా చెల్లెలు గోల్డ్ ధమాకా..

Photo Credit : AFP

Tokyo Olympics : విశ్వక్రీడలు టోక్యో ఒలింపిక్స్ ఉత్కంఠగా సాగుతున్నాయ్. ప్రతి అథ్లెట్ తమ దేశం కోసం పతకం సాధించాలని ఉవ్విల్లూరుతున్నాడు.

  • Share this:
    విశ్వక్రీడలు టోక్యో ఒలింపిక్స్ ఉత్కంఠగా సాగుతున్నాయ్. ప్రతి అథ్లెట్ తమ దేశం కోసం పతకం సాధించాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఇక, 125 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన పోటీల్లో జపాన్‌కు చెందిన అన్నాచెల్లెలు పసిడి పతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. జుడోలో వీరిద్దరూ ఒకేరోజు బంగారు పతకాలు సాధించి ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 21 ఏళ్ల ఉటా అబే మహిళల 52 కేజీల కేటగిరీలో బంగారు పతకం సాధించగా, అంతకు కొన్ని గంటల ముందే ఆమె సోదరుడు హిఫుమి అబే 66 కేజీల పురుషుల ఫైనల్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇలా తోబుట్టువులు ఒకే రోజు పసిడి పతకాలు సాధించడం ఒలింపిక్స్‌ చరిత్ర ఇదే తొలిసారి. అయితే, ఫ్రాన్స్‌కు చెందిన అమండైన్ బుచర్డ్‌తో జరిగిన పోరులో ఉటా విజయం సాధించగా, ఆమె సోదరుడు 23 ఏళ్ల హిఫుమి అబే జార్జియాకు చెందిన వాజా మార్గ్వెలాష్విలితో జరిగిన పోరులో విజయం సాధించి పసిడిని పట్టేశాడు. అయితే, ఈ ఇద్దరు అన్నా చెలెల్లు తాము పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే ఏకంగా పసిడి పతాకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ప్రస్తుత ఒలింపిక్స్‌లో జపాన్‌ పసిడి పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఓవరాల్‌గా ఆతిధ్య దేశం ఖాతాలో ఆరు పతకాలు(5 స్వర్ణాలు సహా ఓ రజతం) చేరాయి.

    మరోవైపు, భారత్ కు మాత్రం మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయ్. పతకం సాధిస్తారనుకున్న అథ్లెట్లు వరుసగా ఇంటి బాట పడుతున్నారు. అయితే, మహిళా స్టార్ అథ్లెట్లు మాత్రం పతక లక్ష్యంగా దూసుకుపోతున్నారు. పీవీ సింధు, మేరీకోమ్, మనికా బాత్రా లు సత్తా చాటుతున్నారు.

    ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బతగిలింది. వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 1-7తో చిత్తుగా ఓడింది. ఈ మధ్య కాలంలో భారత్‌ ఇంత దారుణంగా ఓడటం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా తరఫున బ్లేక్ గోవర్స్(40, 42వ నిమిషం) డబుల్ గోల్స్ అందించగా..జేమ్స్ బీల్(12వ నిమిషం), జెరెమీ హేవార్డ్(21వ నిమిషం), ఆండ్రూ ఒగిలివీ(23)వ నిమిషం), జోషువా బెల్ట్జ్(26వ నిమిషం), ట్రిబ్రాండ్(51వ నిమిషం) చెరొక గోల్ నమోదు చేశారు. భారత్ తరఫున దిల్ ప్రీత్ సింగ్(34వ నిమిషం) ఒక్కడే ఏకైక గోల్ సాధించాడు.
    Published by:Sridhar Reddy
    First published: