ఇండియా జాతీయ క్రీడ హాకీ... కానీ ఇండియన్స్ మనసులో గుడి కట్టేసుకున్న క్రీడ మాత్రం క్రికెట్. అంతగా మన భారతీయుల మనసుల్లో ముద్రవేసుకొంది. అందుకు తగ్గట్టుగానే క్రికెటర్లకు గౌరవ మర్యాదలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రకటనలు దొరకుతున్నాయి. అయితే తాజా టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఎండార్స్మెంట్లు దక్కుతున్నాయి. దీని వెనుక కారణం సోషల్ మీడియా అని తెలుస్తోంది. పది రోజుల క్రితం వరకు మీరాబాయి ఛాను అంటే చాలా తక్కువమందికే తెలుసు. అందులోనూ వెయిట్ లిఫ్టింగ్‌ను క్లోజ్‌గా ఫాలో అయ్యేవారికి, టోక్యో ఒలింపిక్స్‌ను ముందు నుంచి చూస్తున్న వారికే తెలుసు.
అయితే ఇప్పుడు మీరాబాయి ఫేమస్ అయిపోయింది. ‘మీరా భారత్ మహాన్’ అంటూ అందరూ పొంగిపోయారు. ఆమె సాధించిన సిల్వర్ మెడల్ మణిపూర్ పేరు మరోసారి మార్మోగేలా చేసింది. ఇప్పుడు ఆమెకు బ్రాండ్ ఎండార్స్మెంట్లు కూడా బాగానే వస్తున్నాయట.
దేశంలో ఎండార్స్మెంట్లు లేదా ప్రకటనల గురించి చూస్తే... ముందుగా గుర్తొచ్చేది క్రికెట్. ఆ తర్వాత వివిధ క్రీడా రంగాల్లోని తారలు. అప్పుడు కూడా పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి కొన్ని పేర్లే వినిపించేవి. గతంలో అభినవ్ బింద్రా, మేరీ కోమ్ లాంటివాళ్లు పతకాలు గెలుచుకున్నాక... కొన్ని ఎండార్స్మెంట్లు వచ్చేవి. అయితే అనుకున్నంత స్థాయిలోరాలేదని మార్కెట్ వర్గాలు చెబుతుంటాయి.
అయితే ఇప్పుడు ఎండార్స్మెంట్ల జాబితాలో సోషల్ మీడియా కూడా వచ్చింది. సోషల్ మీడియాలో క్రీడాకారులు చేసే బ్రాండ్ పోస్టులకు డబ్బులు ఇస్తున్న విషయం తెలిసిందే. స్టార్ క్రీడాకారులు, సినిమా తారలకు ఒక్కో పోస్టుకు ₹50 లక్షల నుంచి ₹75 లక్షల వరకు అందుతున్నాయట. అయితే తొలిసారి పతకం గెలుచుకున్న వారికి పెద్దగా ఎండార్స్మెంట్ల డబ్బులు రావు. వారికి ఒక్కో పోస్టుకు ₹10లక్షల నుండి ₹15 లక్షలవరకు అందొచ్చని ఓ అంచనా.
అలా ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్నవారు, పేరు సంపాదించినవారు సోషల్ మీడియాతో బాగానే బ్రాండ్ ఎండార్స్మెంట్లు సాధిస్తున్నారని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఆయా ఆటగాళ్ల ఫాలోవర్ల సంఖ్య మీద ఆధారపడి ఉంటుందట. అయితే ఒక్క విజయం క్రీడాకారుల సోషల్ మీడియా ఖాతాల ఫాలోవర్లను చాలా వేగంగా పెంచుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ లెక్కన ఎండార్స్మెంట్ల అమౌంట్ కూడా పెరిగిపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Sports, Tokyo Olympics