టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత్‌కు (India) మరో పతకం (Another Medal) ఖరారైంది. మహిళల బాక్సింగ్ వాల్టర్ వెయిట్ (64 కేజీల నుంచి 69 కేజీల) విబాగంలో భారత బాక్సర్ లవ్లీనా బోర్గెయిన్ (Lovlina Borgohain) సెమీఫైనల్ చేరుకుంది. మీరాబాయి చాను సిల్వర్ మెడల్ తర్వాత.. భారత్ కు మరో పతకాన్ని ఖాయం చేసింది. సెమీస్‌లోనూ గెలిస్తే ఆమె స్వర్ణం లేదా రజతం కోసం పోటీ పడుతుంది. ఒకవేళ ఓడినా... కనీసం కాంస్య పతకం దక్కుతుంది. 2012లో మేరీకోమ్, విజేందర్ సింగ్‌ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది. అయితే, ఒలింపిక్స్ లో మిగతా అన్ని క్రీడాంశాల్లో మూడో స్థానం (బ్రాంజ్ మెడల్) కోసం పోటీలు నిర్వహిస్తారు. సెమీస్‌లో ఓడిన ఇద్దరు బ్రాంజ్ మెడల్ కోసం ఆడాల్సి ఉంటుంది. అయితే బాక్సింగ్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నం. సెమీఫైనల్ చేరిన ఇద్దరికీ మరో మ్యాచ్ లేకుండానే పతకం ఖాయమవుతుంది. సాధారణంగా సెమీస్‌లో ఓడిన బాక్సర్‌పై ప్రత్యర్థి పంచ్‌ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 'నాకౌట్' ఫలితం అయితే కొద్ది సేపటి తర్వాత స్పృహ కోల్పోయే (కన్‌కషన్) అవకాశం కూడా ఉండవచ్చు.
దీంతో, వారు సాధారణ స్థితికి వచ్చి తక్కువ సమయంలో మళ్లీ బరిలోకి దిగడం చాలా కష్టం. అదే గెలిచిన బాక్సర్ అయితే 48-72 గంటల్లో మళ్లీ ఆడగలడు. దీనికి ముందే బ్రాంజ్ మెడల్ కోసం పోటీ జరపాలి కాబట్టి ఓడిన ఆటగాళ్లు అంతకంటే తక్కువ సమయంలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయినా ఆడితే ఇద్దరికీ ప్రమాదం జరగవచ్చు. కాబట్టి మూడో స్థానం మ్యాచ్‌ను రద్దు చేసి ఇద్దరికీ పతకాలు ఇస్తున్నారు. సెమీస్‌లో ఓడిన ప్రతీ బాక్సర్ సమస్య ఎదుర్కోవాలని లేదు కానీ ఒక రకంగా ఇది ప్రాణాల మీదకు రాకుండా ముందు జాగ్రత్త అని చెప్పొచ్చు.
1952 ఒలింపిక్స్ గేమ్స్‌లో తొలిసారి బాక్సింగ్‌లో బ్రాంజ్ మెడల్ ఫైట్ నిర్వహించలేదు. అయితే ఆ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్స్ ఇవ్వలేదు. ఫైనలిస్టులిద్దరికీ గోల్డ్, సిల్వర్ ఇచ్చి సెమీఫైనలిస్ట్‌లకు ఒలింపిక్ డిప్లమా ఇచ్చారు. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్ నుంచి బ్రాంజ్ మెడల్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే 1948 లండన్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ పోటీలు ఆలస్యమవ్వడం.. ఓ బాక్సర్ తీవ్రంగా గాయపడి కాంస్యపోరుకు సిద్దంగా లేకపోవడంతో ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ బ్రాంజ్ మెడల్ ఫైట్ రద్దు చేయాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసీ కోరింది. దీంతో, 1952 ఒలింపిక్స్‌లో కాంస్యపోరు రద్దు చేసిన ఐఓసీ.. 1956 నుంచి సెమీస్‌లో ఓడిన ఇద్దరికీ మెడల్స్ ఇస్తోంది.
ఇక ఆగస్టు 4న జరిగే సెమీఫైనల్లో లవ్లీనా ప్రస్తుత ప్రపంచ చాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలీ (టర్కీ)తో తలపడుతుంది. ఒక వేళ సెమీస్‌లో గెలిస్తే కాంస్యానికి మించిన పతకమే దక్కుతుంది.లవ్లీనా ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. దీంతో లవ్లీనా పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆమె ఎత్తు ఆమెకు అడ్వాంటేజ్. ఇదే అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని లవ్లీనా చరిత్ర సృష్టిస్తోందో లేదో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boxing, Sports, Tokyo Olympics