TOKYO OLYMPICS 2020 JAMAICAN HURDLER HANSLE PARCHMENT REACHED WRONG VENUE AND VOLUNTEER HELPED HIM AND LATER HE CLINCHED THE GOLD MEDAL IN THE MENS 110M HURDLE SRD
Tokyo Olympics : " దారి తప్పిపోయాను.. ఆమె లేకపోతే గోల్డ్ మెడల్ కొట్టేవాణ్ని కాదు" ... సినిమాకు మించిన ట్విస్టులు..
Jamaican hurdler Hansle Parchment
Tokyo Olympics : జమైకా పరుగుల వీరుడు హన్స్ లే పార్చమెంట్ సాధించిన గోల్డ్ మెడల్ వెనుక ఓ పెద్ద కథనే ఉంది. తెలుగు సినిమాలకు మించిన ట్విస్ట్లున్నాయి. కీలక సెమీఫైనల్ ముందు ఈ జమైకా పరుగులు వీరుడు తప్పిపోయాడట.
ఏ నిమిషానో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరన్నది అక్షర సత్యం. ఈ సామెత జమైకా పరుగుల వీరుడు హన్స్ లే పార్చమెంట్(Hansle Parchment) విషయంలో నిజమైంది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics)లో పురుషుల 110 మీటర్ల హర్దిల్స్ రేసులో జమైకా స్ప్రింటర్ హన్స్లే పార్చ్మెంట్ బంగారు పతకం సాధించాడు. వరల్డ్ చాంపియన్‌ను వెనక్కునెట్టి మరి పసిడిని అందుకున్నాడు. ఒలింపిక్స్ పురుషుల 110మీటర్ల హర్డిల్స్‌లో ప్రపంచ చాంపియన్ గ్రాంట్ హాల్లోవేను ఓడించి సంచలనం సృష్టించాడు. పార్చ్మెంట్.. 13.04 సమయంతో పసిడిని ముద్దాడగా.. హాల్లోవే 13.09తో సిల్వర్ దక్కించుకున్నాడు.అయితే అతను సాధించిన గోల్డ్ మెడల్ వెనుక ఓ పెద్ద కథనే ఉంది. తెలుగు సినిమాలకు మించిన ట్విస్ట్లున్నాయి. కీలక సెమీఫైనల్ ముందు ఈ జమైకా పరుగులు వీరుడు తప్పిపోయాడట. అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరిగే చోటుకు కాకుండా ఇతర ఈవెంట్స్ ప్లేస్‌కు వెళ్లాడట. రేస్‌కు సమయం దగ్గరవుతుండటంతో ఏం చేయాలో తెలియక తెగ టెన్షన్ పడ్డాట. కానీ చివరకు ఓ మహిళా వాలింటర్ సాయంతో రేసులో పాల్గొని తన కలను సాకారం చేసుకున్నాడట. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్ల హల్చల్ చేస్తోంది.
"సెమీఫైనల్‌కు ముందు నేను దారి తప్పిపోయాను. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఓ బస్సు ఎక్కాను. అయితే హెడ్‌ఫోన్స్‌తో మ్యూజిక్‌ను అస్వాదిస్తుండటంతో ఆ బస్సులోని ఇతరులు మాట్లాడే మాటలు వినపడలేదు. కానీ బస్సు ఎక్కే ముందు ట్రాక్ అండ్ అథ్లెటిక్స్ అని రాసి ఉన్నట్లు కనిపించింది. కొద్దిసేపటికి నేను వేరే మార్గంలో వెళుతున్నట్టు అర్థమైపోయింది. చుట్టుపక్కన ఉన్నవి నాకు తెలియవు. అలా బస్సు ఎక్కి వేరే స్టేడియానికి వెళ్లిపోయా. అక్కడ రోయింగ్ పోటీలు జరుగుతున్నాయి. అక్కడున్న అధికారులను అడిగితే.. మళ్లీ ఒలింపిక్స్ విలేజ్‌కు వెళ్లి.. అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కాల్సిందే అన్నారు.
నేనే గనుకు అది చేసుంటే టైమ్ సరిపోయేది కాదు. ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాక్సీ తీసుకునేందుకు ప్రయత్నించా. కానీ ఇక్కడి కఠిన నిబంధనల వల్ల సాధ్యం కాలేదు. దాంతో నేను మరింత టెన్షన్‌కు గురయ్యా. చేతులారా నా కలను సాకారం చేసుకునే అవకాశం కోల్పోతున్నానని బాధపడ్డా. కానీ అక్కడే ఉన్న ఓ వాలంటీర్ నాకు సాయం చేసింది. నా పరిస్థితిని అర్థం చేసుకొని ట్యాక్సీ ఏర్పాటు చేసింది. డబ్బులు కూడా ఇచ్చింది.
అలా సమయానికి సరైన స్టేడియంకు వెళ్లాను. ప్రాక్టీస్ చేయగలిగాను. బంగారు పతకం సాధించి నా కలను నెరవేర్చుకున్నాడు. ఆ మహిళా వాలంటీర్ సాయం వల్లే ఇది సాధ్యమైంది. ఆమె కోసం వెతికాను. కొన్నిరోజుల తర్వాత కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్లి నా గోల్డ్ మెడల్ చూపిస్తూ.. ఇది నీ వల్లే సాధ్యమైందని థ్యాంక్స్ చెప్పాను ఓ టీ షర్ట్‌తో పాటు కొంత డబ్బులు కూడా ఇచ్చి సెల్ఫీ కూడా దిగాను" అని హాన్స్లే పార్చ్మెంట్ చెప్పుకొచ్చాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.