మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) శనివారం (ఏప్రిల్ 24) తన 48వ పుట్టిన రోజు (Birthday)జరుపుకుంటున్నాడు. క్రికెట్ చరిత్రలో సచిన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన సచిన్ రమేష్ టెండుల్కర్ తన కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. భారత్ తరపున 200 టెస్టులు, 460 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన సచిన్.. ప్రపంచంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 అంతర్జాతీయ సెంచరీలు కొట్టిన ఏకైన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకు ఎక్కాడు. రంజీల్లో ముంబై తరపున ఆడిన సచిన్.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్న అనంతరం కరోనా బారిన పడటంతో చికిత్స తీసుకొని కోలుకున్నాడు. కాగా, సచిన్ సాధించిన కొన్ని రికార్డుల(Rare Records) గురించి చాలా మందికి తెలియదు. అవేంటో పరిశీలిద్దాం..
అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు
సచిన్ టెండుల్కర్ పాకిస్తాన్‌పై తొలి టెస్టు ఆడాడు. తన సుదీర్ఘ కెరీర్లో 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి.. అత్యధిక టెస్ట్‌లు ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. సచిన్ ఆడినన్ని టెస్టులు ఇప్పటి వరకు ఎవరూ ఆడలేదు. రెండో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్ 168 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారు ఎవరూ ఈ రికార్డును చేరుకోలేరు. కాగా, సచిన క్రికెట్ ఆడే సమయంలో కేవలం టెస్ట్, వన్డే ఫార్మాట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రస్తుతం మూడు ఫార్మాట్లు ఉండటంతో పాటు టెస్టు మ్యాచ్‌ల సంఖ్య కూడా తగ్గింది. మరోవైపు.. సచిన్ పలు కారణాల వల్ల కొన్ని టెస్టులకు దూరమయ్యాడు. అవి కూడా ఆడి ఉంటే 225 టెస్టులను దాటి పోయేవాడు.
అత్యధిక టెస్ట్ రన్స్
సచిన్ టెండుల్కర్ టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. టెస్టుల్లో 15వేల పరుగుల మైలు రాయిని దాటిని ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. సచిన్ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ ఉన్నాడు. అతను టెస్ట్ క్రికెట్లో 13378 పరుగులు చేశాడు. సచిన్ టెస్టుల్లో చేసిన పరుగులు ఇప్పట్లో అధిగమించడం అసాధ్యమే.
అత్యధిక వరల్డ్ కప్స్
సచిన్ టెండుల్కర్ తన కెరీర్లో 6 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో పాల్గొన్నాడు. అంతకు ముందు జావెద్ మియాందాద్ 6 వరల్డ్ కప్‌లు ఆడాడు. వీరిద్దరు తప్ప ఇప్పటి వరకు ఏ క్రికెటర్ అన్ని ప్రపంచ కప్‌లలో ప్రాతినిథ్యం వహించలేదు. మరోవైపు 12 లిస్ట్ ఏ వరల్డ్ కప్‌లలో పాల్గొన్న రికార్డు కూడా సచిన్ పేరట ఉన్నది. అయితే తన కెరీర్లో చివరి వరల్డ్ కప్‌ను అతడు అందుకోవడం విశేషం. 2011లో జరిగిన వరల్డ్ కప్ తన చేతులతో అందుకున్నాడు.
వరల్డ్ కప్‌లో అత్యధిక రన్స్
అత్యధిక వరల్డ్ కప్‌లలో పాల్గొనడమే కాకుండా తన కెరీర్లో అత్యధిక వరల్డ్ కప్ రన్స్ సాధించిన క్రికెటర్‌గా కూడా సచిన్ రికార్డు సృష్టించాడు. సచిన్ 2278 వరల్డ్ కప్ రన్స్ సాధించిన ఏకైక బ్యాట్స్‌మాన్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మాన్ ఈ రికార్డును అందుకోలేక పోయారు.
అతి చిన్న వయసు టెస్ట్ ప్లేయర్
సచిన్ టెండుల్కర్ తొలి టెస్టు ఆడే సమయానికి తన వయసు 16 ఏళ్ల 205 రోజులు. టెస్టు చరిత్రలో ఇంత చిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్ సచిన్ మాత్రమే. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీల్లో తన ప్రతిభను చూసిన సెలెక్టర్లు అండర్19 టీమ్‌కు కాకుండా ఏకంగా జాతీయ జట్టుకు ఎంపిక చేయడం విశేషం. పాకిస్తాన్‌పై తొలి టెస్టు ఆడాడు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.